కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు! | Minister Etela Rajender Fires On Center | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు!

Apr 30 2021 2:15 AM | Updated on Apr 30 2021 8:09 AM

Minister Etela Rajender Fires On Center - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఒరగబెట్టిందేమీ లేదు. వ్యాక్సిన్లు, రెమిడెసివిర్, ఆక్సిజన్‌ వారి నియంత్రణలోనే పెట్టుకున్నారు. ఏం చేయాలో రాష్ట్రాలకు నిర్దేశిస్తున్నారు. రాష్ట్రాల చేతుల్లో దాదాపుగా అధికారాల్లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని నిందించ డం ఆ పార్టీకి, అధికారంలో ఉన్న పెద్దలకు తగదు. ఇతరులను విమర్శించే ముందు మీరేం చేస్తున్నారో, మీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అవలోకనం చేసుకోండి’అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘మీరు అంత గొప్పోళ్లయితే ఢిల్లీలో ఇవాళ ఇంత వేదన ఎందుకు ఉంది? మీరు పాలిస్తున్న గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ లేక, ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. శవాలను ఫుట్‌పాత్‌లపై పెట్టి కాల్చుతున్నారు’అని అన్నారు. గురువారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కేంద్రంలోని పెద్దలు, ఆ పార్టీ నాయకులు తామేదో ఇస్తున్నాం.. రాష్ట్రాలు వాటిని వాడుకోవ డం లేదు.. రాష్ట్రాలు పట్టించుకోవట్లేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత గురించి కేంద్రం రాష్ట్రాలకు తెలపలేదు. కేంద్రానికి తెలిసి ఉంటే ఎన్నికలు ఎలా పెట్టారు? కుంభమేళాకు అనుమతి ఎలా ఇచ్చారు?’అని మంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు. 

19 జిల్లా కేంద్రాల్లో ఉచిత రక్త పరీక్షలు
హోం ఐసోలేషన్, ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్న వ్యక్తులు ప్రతి మూడు రోజులకోసారి రక్తపరీ క్షలు నిర్వహించుకోవాలని మంత్రి ఈటల సూచిం చారు. వైద్యుల సలహాలు, సూచనలు లేక హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల్లో కొందరి ఆరోగ్యం విషమిస్తోందని, నేరుగా వెంటిలేటర్‌ మీద పెట్టాల్సి వస్తోందన్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో కరోనా రోగులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రిమ్స్‌ ఆదిలాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, జోగులాంబ, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, ములుగు ఏరియా, సిరిసిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ ఆస్పత్రుల్లోని డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఈ సదుపాయం కల్పించామన్నారు. ఇప్పటికైతే లాక్‌డౌన్‌ ఆలోచన లేదని చెప్పారు.

ఆక్సిజన్‌ లేక చనిపోవడం అవమానకరం
ఆక్సిజన్‌ లేక జనం చనిపోతున్నారన్న వార్తలు దేశానికి అవమానకరమని మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆక్సిజన్‌ కోసం కేంద్రం వద్ద డబ్బలు లేకుంటే రాష్ట్రాలను అడిగి తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించిందని, వచ్చే నెల్లో 600 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులు, ఆక్సిజన్, రెమిడెవిసిర్‌ బ్లాక్‌ మార్కెట్‌ చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 18–44 ఏళ్ల జనాభా 1.75 కోట్లని, రెండు డోసులకు గాను మూడున్నర కోట్ల వ్యాక్సిన్లు అవసరం కానున్నాయన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంద్నారు. 

రోజూ రోగుల బంధువులకు సమాచారం
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్యస్థితిగతుల గురించి వారి బంధువులకు సమాచారం అందించే వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ప్రతి రోజూ రోగుల ఆరోగ్య పరిస్థితిని వారి బంధువులకు ఫోన్‌ ద్వారా అందించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కనీసం 24 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న రోగుల ఆరోగ్యపరిస్థితిని ఉదయం, సాయంత్రం పరీక్షించి మెరుగ్గా ఉన్న రోగులను ఇళ్లకు పంపించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, వాడిన ప్రతి ఖాళీ సీసాను తిరిగి స్టోర్‌లో అప్పగించాలని చెప్పారు. ఆక్సిజన్‌ నిల్వల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలతో పాటు వైద్యం ప్రారంభించాలని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు.  

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement