‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్‌.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’ | Minister Bandi Sanjay Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్‌.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’

Mar 31 2025 12:25 PM | Updated on Mar 31 2025 2:01 PM

Minister Bandi Sanjay Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలన కంటే కాంగ్రెస్‌ పాలనలోనే అరాచకత్వం ఎక్కువైందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. హెచ్‌సీయూలో విద్యార్థులను కొట్టడం ఎంత వరకు కరెక్ట్‌?. అమ్మాయిలను మెడలు పట్టుకుని లాక్కెళ్లడం దారుణం. వర్సిటీలో 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో విద్యార్థుల అరెస్ట్‌, అక్కడ ఉద్రిక్తతలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్‌సీయూ ఘటన వీడియోలు చూసి తెలంగాణ సమాజం బాధ పడుతుంది. దొంగతనంగా రాత్రికి రాత్రికి  చెట్లు కొట్టేశారు. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. వర్సిటీలో భూములు అమ్మితే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. గజం తావు కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోంది.

ఎబీవీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ లోపల వేసి కొట్టారు. బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్‌ చేస్తోంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యా కమిషన్ పదవులు తీసుకున్న అర్బన్ నక్సల్స్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. భూములు అమ్మి పాలించమంటే ఎవరైనా పాలించగలరు. రేషన్ బియ్యానికి ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తుంది. కిలోకు 40 రూపాయలు ఇస్తున్నది మోదీ ప్రభుత్వం. కిలోకి పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హంగామా చేస్తుంది. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలి. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో పెట్టాలి.

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి ఎంఐఎంకు మద్దతు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌కి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఉన్నా ఎందుకు పోటీ చేయడం లేదు?. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసే ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని ఎంఐఎంకు అప్పగించాలని చూస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement