మార్చినచోటే మారణకాండ | Sakshi
Sakshi News home page

మార్చినచోటే మారణకాండ

Published Mon, May 20 2024 4:20 AM

Minister Ambati provided evidence to the SIT

‘సిట్‌’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటి

చంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస  

ఓటమి భయంతో బాబు రాక్షసత్వం 

తలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదు 

డబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలి 

తొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు  

సత్తెనపల్లి:  రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను స్వా«దీనం చేసుకుని ఈవీఎంలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో టీడీపీ దాడులకు తెగబడిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బూత్‌ నంబర్లతో సహా ఈ వివరాలను వెల్లడించి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరితే అవసరం లేదని ఎన్నికల కమిషన్‌ చెబుతోందన్నారు. ఈ దారుణానికి కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్‌ను, ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు ఉన్నతాధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు మేరకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిందని గుర్తు చేశారు. పల్నాడుతోపాటు అనంతపురం, తాడిపత్రిలో చెలరేగిన హింసను నియంత్రించలేక పోలీసులు చేతులు ఎత్తేశారన్నారు.

మంత్రి అంబటి ఆదివారం నరసరావుపేటలో ‘సిట్‌’ అధికారులను కలసి ఎన్నికల హింస, కొందరు పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై ఫిర్యాదు చేశారు.  అనంతరం గుంటూరు మిర్చి యార్డ్‌ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణతో కలసి సత్తెనపల్లిలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు.  

చరిత్రలో చూడని విచిత్రం 
రాయలసీమ, పల్నాడులో గతంలో ఇంత హింస చెలరేగిన సందర్భాలు లేవు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు బాధ్యతలు చేపట్టాక టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశాయి. పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్‌ సీపీ చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఏడుకు ఏడు సీట్లు గెలవడం, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉన్నందున దాడులకు తెగబడ్డారు. తాము నియమించిన ఐపీఎస్‌ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఈసీ సస్పెన్షన్‌ వేటు వేయడం చరిత్రలో ఎప్పుడూ చూడని విచిత్రం.

సత్తెనపల్లి రూరల్‌ సీఐపై ఫిర్యాదు 
నరసరావుపేటలో సిట్‌ అధికారుల బృందాన్ని కలిసి వాస్తవాలను తెలియచేశా. రుజువులు, ఆధారాలు నివేదిక రూపంలో సమర్పించాం. పోలీసులే కౌంటర్‌ కేసులు పెట్టిస్తున్నారు. తప్పుడు కేసులతో బాధితులనే బెదిరిస్తున్నారు. సత్తెనపల్లి రూరల్‌ సీఐ మీసాల రాంబాబుపై ఫిర్యాదు చేశా. కొందరు పోలీసులు టీడీపీ నేతలకు డబ్బులకు అమ్ముడు పోయారు. కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు ఇచ్చిన డబ్బులకు లొంగిపోయినట్లు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరా.  

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

తొండపిలో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 
పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కొత్త ఎస్పీని కోరుతున్నా. ముస్లింల ఇళ్లు, బైకులు తగలబెట్టారు. ముస్లిం మైనార్టీలు ప్రాణ భయంతో ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వారికి పార్టీ తరపున అండగా ఉంటాం. వైఎస్సార్‌ సీపీ మరోసారి ప్రభంజ­నం సృష్టిస్తుంది. వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

యథేచ్ఛగా విధ్వంసం.. 
పోలింగ్‌ రోజు తలలు పగిలి పోతున్నా పోలీసులు రాలేదు. అల్లరి మూకలు అలసిపోయే వరకు యథేచ్ఛగా మారణకాండకు తెగబడ్డాయి. నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వి కార్లు ధ్వంసం చేశారు. నార్నెపాడులో ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్న నా అల్లుడు ఉపేష్‌ కారును సైతం ధ్వంసం చేశారు.

 మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు తీసుకోవాలని కోరినా స్పందించలేదు. ఓటమి భయంతో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరించారు. అధికారం దక్కదని పసిగట్టిన ప్రతి సందర్భంలోనూ ఆయన హింసను నమ్ముకున్నట్లు చరిత్ర చెబుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement