Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు | Sakshi
Sakshi News home page

Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు

Published Wed, Mar 27 2024 2:52 PM

Mahua Moitra Has Been Summoned By The Enforcement Directorate  - Sakshi

పశ్చిమ బెంగాల్‌ కృష్ణానగర్‌ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్‌ కాంగ్రెస్‌ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.  

మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్స్‌ట్రనల్‌ (ఎన్‌ఆర్‌ఈ), అకౌంట్స్‌, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు (foreign remittance)చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు.

గతంలో రెండు సార్లు 
గత ఏడాది మహువా మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్‌వర్డ్‌ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్‌లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు.

అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్‌లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 

రూ.2 కోట్ల వరకు 
తాజాగా, పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్‌ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్‌సైట్‌ లాగిన్ వివరాలను దర్శన్‌ హీరానందానీకి షేర్‌ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.  

కాగా, క్యాష్‌ ఫర్‌ క్వైరీ ఆరోపణల్ని మోయిత్రా ఖండించారు (కానీ ఆమె వెబ్‌సైట్ ఆధారాలను పంచుకున్నారని, ఇది ఎంపీలలో సాధారణ పద్ధతి అని వాదించారు). మేలో ఈ కేసును  సుప్రీంకోర్టు విచారించనుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement