రెబల్స్‌ మంత్రులకు షాక్‌.. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సంచలన నిర్ణయం!

Maharashtra: Uddhav Thackeray Hands Over 9 Rebel Ministers Portfolios To Others - Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్‌, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. 

రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది.

ఎవరి శాఖలు... ఎవరికి..
రెబల్స్‌ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్‌ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్‌ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. 

శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్‌ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్‌ఎస్‌ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్‌నాథ్‌ షిండే ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌ కీలక నేతలతో రాజ్‌ ఠాక్రే భేటీ అయ్యారు.

చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top