బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా? | Lok Sabha Elections 2024: Delhi BJP's Big Experiments Will Succeed? | Sakshi
Sakshi News home page

హస్తిన: ఎన్నికల్లో బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?

May 18 2024 10:56 AM | Updated on May 18 2024 11:26 AM

Lok Sabha Elections 2024: Delhi BJP's Big Experiments Will Succeed?

అది దేశానికి గుండెకాయ. మినీ ఇండియా అనే మరో పేరు కూడా ఉంది. అక్కడ కమలం పార్టీ క్లీన్‌ స్వీప్‌ అదీ రెండుసార్లు..

ఆరుగురు సిట్టింగ్ ఎంపీల‌ను మార్చేసి బీజేపీ పెద్ద ప్రయోగం

సుష్మాస్వ‌రాజ్ కూతురికి టికెట్ ఇచ్చిన కమలం పార్టీ

మోదీ కరిష్మా.. ప‌థ‌కాల‌నే న‌మ్ముకున్న బీజేపీ

అయినా.. ఆప్‌-కాంగ్రెస్ క‌ల‌యిక‌తో ఈసారి బీజేపీకి గ‌ట్టి స‌వాలే

అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సానుభూతికోసం ట్రై చేస్తున్న ఆప్‌

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హ్య‌ట్రిక్‌ విక్టరీపై బీజేపీ క‌న్నేసింది. అయితే అది కేవ‌లం జాతీయ స్థాయిలోనే కాదు. దేశానికి గుండెకాయలాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్య‌ట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలోని ఏడు సీట్ల‌కు ఏడు సీట్లు కాషాయం పార్టీనే గెలుచుకుంది. అయితే.. ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగానికే దిగింది. 

ఢిల్లీలో ఈనెల 25న లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గనుంది. అయితే ఈసారి పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం ఏడు సీట్లలో.. ఆరుగురు సిట్టింగ్‌లను పక్కన పెట్టేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మ‌నోజ్ తివారి మాత్ర‌మే టికెట్ ద‌క్కించుకోగ‌లిగారు. బీజేపీ లీగల్‌ సెల్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్న సుష్మాస్వ‌రాజ్ కూతురు బన్సూరి స్వ‌రాజ్.. న్యూఢిల్లీ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్‌ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేయడం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బస్సూరితో పాటు చాందిని చౌక్ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, ఈస్ట్ ఢిల్లీ నుంచి హ‌ర్ష మ‌ల్హోత్ర‌, నార్త్‌వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా,  వెస్ట్ డిల్లీ నుంచి క‌మ‌ల్‌జీత్ సెహ్ర‌వాత్‌, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిదూరి కొత్తగా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

➡️ అయితే.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపికి గ‌ట్టి స‌వాలే ఎదుర‌వుతోంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆప్‌, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేయ‌డంతో బీజేపీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా మారింది. కానీ ఈ సారి ఆప్‌, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ నాలుగు సీట్ల‌లో, కాంగ్రెస్ మూడు సీట్ల‌లో పోటీ  చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా.. 

➡️ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అర‌వింద్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైల్లో పెట్టార‌ని ఆప్ ప్ర‌చారం చేస్తోంది. తద్వారా ప్ర‌జ‌ల్లో కొంత సానుభూతిని రాబ‌ట్టాలని చూస్తోంది. ఈ ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈలోపే.. 

➡️కేజ్రీవాల్ నివాసంలో ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘ‌ట‌న జరిగింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజ‌కీయ ప్ర‌చార అస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌తలేద‌నే అంశాన్ని బీజేపీ ఎన్నిక‌ల అస్త్రంగా వాడుతోంది. అయితే బీజేపీ కేవలం ప్రత్యర్థులపై విమర్శలతోనే సరిపెట్టడం లేదు. 

➡️న‌రేంద్ర మోదీ సారథ్యంలో గత ప్ర‌భుత్వం ప‌దేళ్ల సాధించిన విజ‌యాల‌నూ ఢిల్లీలో బిజెపి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. 2047 క‌ల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌నే విజన్‌ను రాజధాని ప్ర‌జ‌ల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ఢిల్లీలో అమ‌లు చేయ‌కుండా కేజ్రీవాల్ అడ్డుప‌డ్డార‌నే విష‌యాన్ని జ‌నంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌లో రాజ‌కీయ చైతన్యం ఎక్కువ‌. అన్ని పార్టీల ప్ర‌చారాల‌ను గ‌మ‌నిస్తున్న ఓట‌రు ఎటు నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement