ఎయిడెడ్‌ను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే

Lella Appi Reddy Comments On Chandrababu - Sakshi

విద్యార్థి సంఘాల నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలి

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ∙టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత జన్నత్‌ హుస్సేన్‌ సహా 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. వాటిని నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలు చేపట్టడానికి వీలు లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ విద్యార్థి యూనియన్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నత్‌ హుస్సేన్‌తో పాటు 200 మంది టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, సభ్యులు వైఎస్సార్‌సీపీలో చేరారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వారిని లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ప్రయోజనాలను తెలుసుకోవాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, విద్యా సంస్థలను అభివృద్ధి చేయడమే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీ నేతల ట్రాప్‌లో పడవద్దని కోరారు. ప్రభుత్వంలో విలీనం వల్ల ఫీజులు పెరుగుతాయంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు కూడా ఆగకూడదని, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, నాడు–నేడు.. ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజల్ని కోరారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత జన్నత్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నారాయణమూర్తి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top