
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్(Kommineni Srinivasa Rao) పై కక్ష సాధించడం కోసం కూటమి ప్రభుత్వం అడ్డదారులను ఎంచుకుంటోంది. టీవీ డిబేట్‌లో తన జోక్యం, ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు కక్ష చల్లారనట్లుంది!. అందుకే టీడీపీ నేతల(TDP Leaders)తో మరిన్ని కేసులు పెట్టిస్తున్నారు.
తుళ్లూరు పీఎస్ కేసులో ఆయన సోమవారం అరెస్టు కాగా.. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు కొమ్మినేని విషయంలో ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. విజయవాడ సత్యనారాయణ పురం, పడమట పీఎస్, సాలూరు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదులతో కొమ్మినేనిపై కేసులు నమోదయ్యాయి. అయితే..
ఇప్పటికే కొమ్మినేనిపై దాఖలు చేసిన సెక్షన్ల విషయంలో మంగళగిరి కోర్టు(Mangalagiri Court) ఇవాళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ.. ఆ సెక్షన్లను కొట్టేసింది. ఈ తరుణంలో ఆయనపై కేసు వీగిపోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే..
ఒకవేళ ఈ కేసులో గనుక ఆయనకు బెయిల్ లభిస్తే.. మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం తాజా కేసులతో స్పష్టమవుతోంది. గతంలో పోసాని విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్‌లపై అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూటమి నేతలతో కేసులు పెట్టించారు. దీంతో ఆయన్ని పీటీ వారెంట్ కింద వివిధ జైళ్లకు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.
కొమ్మినేనిపై మరో మూడు కేసులు
ఎక్కడ?.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు
పెట్టింది ఎవరు?.. టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంధ్యా రాణి
ఏయే సెక్షన్లు?.. 79BNS,67A ITA-2000-2008,75(3) BNS సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసు
ఎక్కడ?.. విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
పెట్టింది ఎవరు?.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు
ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1)(a),353(1)(b),61(2), r/w 3(5)BNS, 67A ITA 2000-2008 సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసు
ఎక్కడ?.. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్‌లో
పెట్టింది ఎవరు?.. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి
ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1),353(3)b, 61(2),r/w 3(5) BNS, 67A ITA2000-2008 సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసు నమోదు