
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను పెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా.. ఓ కేసులో పీఎస్ విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.
సాక్షి, కృష్ణా జిల్లా: రాజకీయ కక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి పోలీసులను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తుండడంపై ఆర్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. పలు కేసుల్లో ఈ మధ్యే బెయిల్ మీద బయటకు వచ్చిన.. కోర్టు ఆదేశాలు మేరకు క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పీఎస్‌కు వెళ్లారు.
మధ్యాహ్నాం 12గం. సమయంలో ఆయన స్టేషన్‌కు వెళ్లి విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే అప్పటికి విచారణ అధికారి రాలేదు. గత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కాస్త త్వరగా విచారించి వంశీని పంపించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అయితే అధికారి రానిది తామేమీ చేయలేమని కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. అలా..

మూడు గంటలు గడిచింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఆయన పీఎస్‌లో బెంచీపై అలా కూర్చుని ఉండిపోయారు. చివరకు అధికారి ఇవాళ రాడని.. మళ్లీ విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామంతో ఆయన అనుచరులు ఒకింత అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వంశీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆ సమయంలో వంశీ వారిని సముదాయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆస్పత్రికి వెళ్లారాయన.

ఇదీ చదవండి: ఇంత అణచివేతనా? ఇది పోలీసుల రాజ్యమా? లేక..