
విజయనగరం, సాక్షి: ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?. అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా?. మా అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాలి.
వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో ప్రజల అవసరాలన్నీ సమయానికి తీర్చాం. కానీ, ఏడాది పాలనలో రూ.లక్షా 40 వేలకోట్ల అప్పు తెచ్చారు. అన్ని కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేశారు?. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?. గత ప్రభుత్వాల మాదిరిగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు?. ప్రజలు, రైతులను విస్మరించడం కూటమి ప్రభుత్వానికి భావ్యం కాదు అని బొత్స అన్నారు.

ఇదీ చదవండి: వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నమా?