
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, సండ్ర వెంకటవీరయ్య తదితరులు
తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా
కేసీఆర్ చెప్పినా వినకపోవడం
వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చింది
ఖమ్మం జిల్లా పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు
సత్తుపల్లి: ‘రాష్ట్రమంతా బర్బాద్ అయింది.. ఏమైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అన్నా అని ఓ ఆటోడ్రైవర్ ఈ మధ్య సిగ్నల్ దగ్గర నన్ను గుర్తుపట్టి అడిగారు.. ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష.. తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా.. రీకాల్ వ్యవస్థ మనకు లేదు..’అని చెప్పానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ప్రపంచ మేధావి బీఆర్ అంబేడ్కర్ ఊహించక పోవడంతోనే వారిని ఐదేళ్లూ భరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు పలువురు సీఎంలను చూసిన తాను, రేవంత్‌రెడ్డి వంటి దివాలాకోరు సీఎంను మాత్రం చూడలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్తే తమ మాటలు నమ్మడం లేదని, దొంగల్లా చూస్తున్నారని, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారని.. మోసపోతే గోస పడతామని చెప్పినా ప్రజలు వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్‌ఎస్ పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు. తొలుత పహల్గాం మృతులతో పాటు యుద్ధంలో అమరులైన జవాన్లకు కేటీఆర్ సహా నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.