మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు? | KTR Fires On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు?

May 3 2023 4:52 AM | Updated on May 3 2023 4:52 AM

KTR Fires On PM Narendra Modi - Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో రైతును ఓదారుస్తున్న కేటీఆర్‌

సిరిసిల్ల: ఉచితాలు వద్దని, రేవుడీ కల్చర్‌ అంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఏటా మూడు సిలిండర్లు, నిత్యం అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడా­న్ని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఒక్క కర్ణాటకకేనా అని ప్రశ్నించారు. సిలిండర్‌ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన బీజేపీ సర్కార్‌.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వదని, మిగతా రాష్ట్రాల్లోనూ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

పాలపైనా జీఎస్‌టీ వేసిన కేంద్ర ప్రభుత్వం హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

90 శాతం వరకు వరి నష్టం 
రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా యాసంగి సీజన్‌లో వరిని సాగు చేశారని, అయితే అనూహ్యంగా వచ్చిన వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని కేటీఆర్‌ చెప్పారు. వరి పంట 30 శాతం నుంచి 90 శాతం మేరకు నష్టం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 19 వేల ఎకరాల్లో 17 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్‌ జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఐదు జిల్లాల్లో పర్యటించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్ను ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు.

ఇలావుండగా.. రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, నీరు ఇచ్చే తెలంగాణ వ్యవసాయ విధానం కావాలని దేశమంతా కోరుకుంటోందని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఈ సమయానికి కేవలం 4 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పంటలు వేసిన అసైన్డ్‌ భూములు, పోడు భూములకు కూడా నష్ట పరిహారం ఇస్తామన్నారు. 

మహిళల భద్రతకు ‘అభయ’యాప్‌ 
మహిళల భద్రతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రూపొందించిన ‘అభయ’యాప్‌ను మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల మినీ స్టేడియంలో ఆవిష్కరించారు. జిల్లా పోలీస్‌ క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పర్యవేక్షణలో రాష్ట్రంలోనే తొలిసారి రూపొందించిన ‘అభయ’యాప్‌ను ఆవిష్కరించారు. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉమెన్‌ సెఫ్టీ కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ పనిచేస్తుందని, ట్రాక్‌ మై లొకేషన్‌ పోలీసులకు షేర్‌ అవుతుందన్నారు.

ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా సచివాయంలోకి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘అది సచివులు ఉండే చోటు, సచివులకే ప్రవేశం ఉంటుంది..’అంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement