నిరూపిస్తే రాజీనామా

KTR Fires On BJP Govt On Central Govt Funds - Sakshi

కేంద్రం ఇచ్చానంటున్న నిధులపై బీజేపీ నేతలకు కేటీఆర్‌ సవాల్‌

పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువే చెల్లించాం

తెలంగాణకు ఏం ఉద్ధరించారో శ్వేతపత్రం విడుదల చేయండి

కేంద్రానివన్నీ నిరంకుశ విధానాలు.. అప్రజాస్వామిక వ్యవహారాలే

‘జుమ్లాలు లేకపోతే హమ్లాలు’.. వీటిపై ఆధారపడే జుమ్లా జీవులు

దేశంలో మోదీ రాజ్యాంగం.. దీనిపై తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమో!

రాజ్యాంగ పరిరక్షణ కోసమే యశ్వంత్‌ సిన్హాకు మద్దతిచ్చామని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి కట్టినదాని కంటే, తిరిగి తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు బీజేపీ నాయకులు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ‘త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న బీజేపీ జాతీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా? లేదా ఈ దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా? అనే అంశంతోపాటు గత ఎనిమిదేళ్లలో కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని ఆయన డిమాండ్‌ చేశారు.

గత 8 ఏళ్లలో పన్నుల రూపంలో రాష్ట్రం కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల్లో తెలంగాణకు ఏం చేశారని, ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పార్లమెంటులో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి పాల్గొన్న అనంతరం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ నుంచే తిరుగుబాటు
కేంద్రం నియంతలా చేస్తున్న అన్యాయాల పరంపర అడ్డూ అదుపులేకుండా సాగుతోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు. దేశంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి, మోదీ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయని, తిరుగుబాటు తెలంగాణ నుంచే వస్తుందేమోనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగబద్ధ వ్యవస్థలను విపక్షాలపై వేటకుక్కల్లా ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు చేస్తున్న విధానాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతీ పార్టీకి ఉందని చెప్పారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి నిరసనగా విపక్షాలు బలపరిచిన యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. యశ్వంత్‌ సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలను కోరారు. ప్రచారంలో భాగంగా యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించామన్నారు. 

దళితుల కోసం ఏం చేశారు?
గిరిజనుల విషయంలో నోటితో నవ్వి, నొసలుతో వెక్కిరించే బీజేపీ విధానం తెలంగాణతోపాటు, దేశ గిరిజనులకు తెలుసని కేటీఆర్‌ అన్నారు. భీష్ముడు మంచి వాడైనా... కౌరవుల వైపు నిలబడ్డందుకు ఓటమి తప్పలేదని వ్యాఖ్యానించారు. అయితే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

అయితే ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే, దేశంలో గిరిజనుల బతుకులు మారుతాయని బీజేపీ చెప్పడం సరికాదని హితవు పలికారు. ‘దళితుడిని రాష్ట్రపతి చేశామని చెప్పుకుంటున్న బీజేపీ గత ఐదేళ్లలో దళితుల కోసం ఏం చేసింది? మోదీ ప్రభుత్వంలో విషం తప్ప.. విషయం లేదు. రాష్ట్రానికి ఇచ్చింది చెప్పమంటే, కుటుంబపాలన, అవినీతి పాలన అంటూ ఫాల్తు మాటలు మాట్లాడుతున్నారు’అంటూ మండిపడ్డారు.

హైదరాబాద్‌కు జుమ్లా జీవులు
ఏ విషయంలోనైనా జుమ్లాలు లేకపోతే హమ్లాలు తప్ప వేరే ఏదీ బీజేపీకి రాదని కేటీఆర్‌ విమర్శించారు. వారు చేసే మోసాలను నమ్మకపోతే సీబీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తారంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ వి«ధానాలకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు యశ్వంత్‌ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి, మద్దతు తెలపాలని శరద్‌ పవార్, మమతా బెనర్జీలు కేసీఆర్‌ను కోరడంతోనే టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని చెప్పారు. ‘ప్రతిపక్షాల కూటమిలో మేమున్నామని ఎవరు చెప్పారు? కొద్దిమందితో కలిసి సంతకాలు పెడితే... ప్రతిపక్ష కూటమి అని పేరు పెడతారా?’అని ప్రశ్నించారు.

తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తూ వెళ్తూ ఉంటారని, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూమ్లా జీవులు హైదరాబాద్‌ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు. కానీ, రాష్ట్రంలో కేంద్రం ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్‌ కట్టలేకపోయిందన్నారు. అయితే ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించినా.. అది పూర్తి కాలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top