నేతన్నల కోసం కేంద్రంతో కొట్లాడతా: మంత్రి కేటీఆర్‌

Ktr Criticized Bjp On Weavers Welfare - Sakshi

ఏడేళ్లలో మోదీ సర్కారు చేసిందేం లేదు: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌/సిరిసిల్ల: ‘‘రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నల సంక్షేమానికి నిధులు కేటా యిం చాలని కేంద్రానికి ఏడేళ్లలో ఎన్నో ఉత్తరాలు రాశా. ఉలుకూ.. పలుకూ లేదు. ‘అయిననూ వెళ్లి రావాలి హస్తినకు’అన్నట్లు ఇప్పుడు ఎనిమిదోసారి రాస్తున్నా. ఇప్పటికైనా స్పందించి నిధులు మంజూరు చేస్తే సరి. లేకుంటే రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నలతో కలిసి పోరాడతా’’నని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని వినమ్రంగా కోరుతున్నానని, సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనే ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌  తన పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల నేతన్నల కో సం మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ సాధించాలని డిమాం డ్‌ చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధులు సాధించేందుకు తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. ఈమేరకు ఆయనకు కూడా లేఖ రాస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. 

కాకతీయకు రూ.897 కోట్లివ్వండి 
ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలిచిన సందర్భాలే లేవని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ విడుదల చేస్తున్న సందర్భంగా వరంగల్‌లో ఏర్పా టు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు పీఎం మిత్ర పథకంలో రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. 1,250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద టెక్స్‌టైల్, అపెరల్‌ పార్క్‌కు నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. గద్వాల, కొత్తకోట, నారాయణపేట, దుబ్బాక, జమ్మికుంట, కమలాపూర్, పోచంపల్లి వంటి పదకొండు కేంద్రాల్లో చేనేత సమూహాలను ఏర్పాటు చేసి నేతన్నలను ఆదుకోవాలని కోరారు.  

15 బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు ఇవ్వండి 
నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌హెచ్‌డీపీ)లో భాగంగా 15 బ్లాక్‌ లెవల్‌ హ్యాం డ్లూమ్‌ క్లస్టర్లు మంజూరు చేయాలని, గతంలో మంజూరైన 8 క్లస్టర్లకు రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రావాల్సిన రూ.7.20 కోట్లు వెంటనే ఇవ్వాలని మంత్రి కోరారు. హైదరాబాద్‌లో నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలన్నారు. మౌళిక వసతులు, ఆధునీకరణ, విస్తరణ, మార్కెట్‌ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ తదితరాల కోసం సిరిసిల్లలోని టెక్స్‌టైల్, వీవింగ్, అపెరల్‌ పార్క్‌కు రూ.49.84 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ఈ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం రూ.756.97 కోట్లు వాటాగా చెల్లిస్తుందని చెప్పారు. 

ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పోచంపల్లి అనుకూలం 
ఉమ్మడి ఏపీలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) సెంటర్‌ను తెలంగాణలోని పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రులకు లేఖలు రాశానని.. అయినా నెల్లూరు జిల్లా వెంకటగిరి వెళ్లిందని కేటీఆర్‌ చెప్పారు. దీంతో రాష్ట్రంలో హ్యాండ్లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు నిర్వహించే సంస్థలేవీ లేవన్నారు. రాష్ట్రంలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కులో భవనాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ‘ఇన్‌ సిటు’ పథకంలో భాగంగా మరమగ్గాల ఆధునీకరణకయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నందున 13,886 మరమగ్గాల ఆధునీకరణకు రూ.13.88 కోట్లను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏటీయూఎఫ్‌ పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటయ్యే వస్త్ర తయారీ పరిశ్రమలకు బ్యాంకుల రుణ పరపతి నిబంధనలు సడలించాలని కేటీఆర్‌ కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top