బీజేపీ అంటే‘బేచో జనతాకీ ప్రాపర్టీ’.. ట్విట్టర్‌లో కేటీఆర్‌ సెటైర్లు | Sakshi
Sakshi News home page

బీజేపీ అంటే‘బేచో జనతాకీ ప్రాపర్టీ’.. ట్విట్టర్‌ ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో మంత్రి ఎద్దేవా..

Published Mon, May 9 2022 1:07 AM

Ktr Chit Chat With Twitter Netizens Ask Ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై ట్యాక్స్‌ తగ్గించాలని ప్రధాని మోదీ చెప్పిన మాట ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది. 2014లో 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈరోజు వెయ్యి రూపాయలు దాటింది. ఇది కేవలం మోదీ పరిపాలన వల్లే సాధ్యమైంది. పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎల్పీజీ ధరల విషయంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

మోదీ అచ్ఛే దిన్‌కు స్వాగతం’’ అని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు  కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలన్నింటి నుంచీ పోటీ ఉంటుందని.. కానీ ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని పేర్కొన్నారు. ఆదివారం కేటీఆర్‌ ట్విట్టర్‌లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 


భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. 
ప్రస్తుతం కాంగ్రెస్‌ కన్నా గట్టిగా బీజేపీని, ప్రధాని మోదీ విధానాలను నిలదీస్తున్నది కేసీఆర్‌ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ పార్టీయేనని కేటీఆర్‌ చెప్పారు. జాతీయ స్థాయిలోకి టీఆర్‌ఎస్‌ విస్తరించే అవకాశముందా అని ఒక నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు..’ అని బదులిచ్చారు. జాతీయ స్థాయిలో మీ నాయకత్వం కావాలని మరో నెటిజన్‌ ప్రస్తావించగా.. ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నా’నని కేటీఆర్‌ సమాధానమిచ్చారు. 

బీజేపీ కాదు.. ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ 
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముతున్న బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ (ప్రజల ఆస్తులు అమ్మేయడం)’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద అద్భుతంగా పనిచేస్తోందని విమర్శించారు. కర్నాటకలో సీఎం పదవిని రూ.2,500 కోట్లకు బేరం పెట్టారన్న వార్తలు బీజేపీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేశాయని.. హరియాణాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం తీరుపై రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాలన్నారు.  

కేంద్రం ఏమీ ఇవ్వదు 
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని.. వారిపై ఆశలు వదులుకుని సొంతంగా ఉద్యోగాల కల్పన ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఎనిమిదేళ్లుగా అడుగుతున్నా ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐడీ వంటి సంస్థల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 

ఆరోగ్య రంగానికి పెద్దపీట 
తమ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కొత్తగా మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని.. వరంగల్‌ ఎంజీఎంను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు. 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా పెద్దాస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రమైన తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఒక నెటిజన్‌ ప్రస్తావించగా.. మిషన్‌ భగీరథ ద్వారా ఇప్పటికే ఆ సమస్య చాలా వరకు తొలగిపోయిందని, ఒకవేళ ఎక్కడైనా కొరత ఉంటే మన ఊరు–మన బడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో రోడ్లపైనే జరుగుతున్న హత్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ బదులిచ్చారు.  

ట్రాఫిక్‌కు ప్రతి ఒక్కరికీ బాధ్యత 
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం నగర పౌరుల బాధ్యత అని.. పోలీసులు కేవలం నిబంధనలు అమలు చేసే ప్రయత్నం చేస్తారని కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిరిగి ప్రవేశపెట్టడంపై హెచ్‌ఎండీఎ, ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. 
 
హిమాన్షును చూసి గర్వపడుతున్నా.. 
రాజకీయాల్లోకి రావాలనుకుంటే యువత అత్యంత సహనంతో కఠినంగా వర్క్‌ చేయాలని కేటీఆర్‌ సలహా ఇచ్చారు. తన కుమారుడు హిమాన్షు పాఠశాలలో క్రియేటివ్‌ యాక్షన్‌ ప్లాన్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఒక తండ్రిగా గర్వపడుతున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తర్వాత దేశంలో తనకు అత్యంత ఇష్టమైన నాయకుడు అబ్దుల్‌ కలాం అని పేర్కొన్నారు.   

Advertisement
Advertisement