కేంద్రంపై ‘వరి’ యుద్ధం

Ktr Announce Action Plan Against Central Government On Paddy Procurement - Sakshi

గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన పోరు: కేటీఆర్‌

11న ఢిల్లీ దీక్షలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతులను అవమానించేలా మాట్లాడిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీ ఉద్యమ కార్యాచరణను శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో మొదలయ్యే టీఆర్‌ఎస్‌ నిరసనలు 11న ఢిల్లీ వేదికగా జరిగే నిరసన దాకా కొనసాగుతాయని కేటీఆర్‌ వివరించారు. ఢిల్లీలో జరిగే నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. 

దౌర్భాగ్య నాయకులు రెచ్చగొట్టి వరి వేయించారు... 
‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని మూర్ఖపు, పిచ్చి, రైతు వ్యతిరేక, మనసులేని ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, రాష్ట్రానిది దళారీ పాత్ర అంటూ రైతుల్ని రెచ్చగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ గతేడాది నవంబర్‌ 18న సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి నిరసన దీక్షకు దిగారు.

సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గినా 35–36 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. బండి సంజయ్‌ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన కేంద్ర మంత్రి వల్లే ఈ పరిస్థితి తలెత్తగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాత్రం తెలివితక్కువ వాళ్లు అంటూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఇప్పుడు రైతులు పండించే ధాన్యాన్ని బీరాలు పలికిన బీజేపీ దౌర్భాగ్యులు తీసుకుంటారా? ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టం.. అంతు చూస్తాం. ఇప్పటికే 12,769 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు తదితర సంస్థలన్నీ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించి ప్రధానికి పంపాయి.

కేంద్రం స్పందించనందున గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలపాలని నిర్ణయించాం’అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గండ్ర వెంకట రమణారెడ్డి, గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, క్రాంతికిరణ్, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ ఉద్యమ కార్యాచరణ... 
► ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఈ శిబిరంలో రైతులు కూడా పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 
► 5న విరామం 
► 6న రాష్ట్రం మీదుగా వెళ్లే 4 జాతీయ రహదారులపై నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రాస్తారోకోలు చేపడతారు. 
►  7న హైదరాబాద్‌ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి. 
►  8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, రైతులు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి కేంద్రం దమననీతి, భ్రష్టు రాజకీయాలపై నిరసన తెలపాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 
   9, 10 తేదీల్లో విరామం 
►  11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిరసనకు దిగనుంది. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ మినహా 141 మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. 

చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్‌ 

.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top