అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి! | KSR Comments On Yellow Media And Chandrababu | Sakshi
Sakshi News home page

అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!

May 3 2025 11:10 AM | Updated on May 3 2025 1:21 PM

KSR Comments On Yellow Media And Chandrababu

రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు  ప్రచారం చేశారు.

సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.

అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే  దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న  చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు  కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.

ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.

ఇప్పుడు  ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను  మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. 
ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే  అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో  క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.

లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే  వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.

ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.

తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.

గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement