
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.
విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.
కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.
తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.
ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.

సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.
టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.
అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.
టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.
నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.