ప్రియమైన నా అంతరాత్మకు..
● చాలా రోజులుగా నీతో మాట్లాడాలనుకుంటున్నా. కానీ మనసులోని మాటను బయటపెట్టలేకపోతున్నా. ఇప్పుడు సమయం వచ్చింది. ఆదివారం మున్సిపల్ ఎన్నికలు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఒక్కసారి నా అంతరాత్మను నేను ప్రశ్నించుకోవాలనుకుంటున్నా.
●2024 ఎన్నికల సమయంలో ఎన్నో ఆశలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేశా. అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత నేను చూసింది వేరు, ఎన్నికల ముందు కనిపించిన నాయకులు వేరు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట సృష్టిస్తున్న అరాచకం చూసి భయపడ్డా. సంపద సృష్టిస్తామని చెప్పిన వారే.. సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవని, సంపద ఎలా సృష్టించాలో మీరే చెప్పాలని ప్రజలను
అడిగినప్పుడు షాక్‌కు గురయ్యా.
●నా కుటుంబానికి ఎన్నో ఆశలు చూపించారు. నా భార్యకు రూ.1,500, నా తల్లికి రూ.1,500, నా పిన్నికి రూ.1,500, నా తండ్రికి వృద్ధాప్య పింఛన్, తమ్ముడికి నిరుద్యోగ భృతి, చేతివృత్తిని నమ్ముకుని బతుకుతున్న నా బాబాయ్‌కు 50 ఏళ్లకే పింఛన్, మా ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, నా భార్య పేరుతో ఉన్న పొలానికి అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, నా తల్లి, భార్యకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు.
●ఇప్పుడు రెండున్నరేళ్లు గడిచిపోయాయి. నా భార్య, తల్లి, పిన్నికి ప్రతి నెలా అందుతాయనుకున్న రూ.1,500 జాడేలేదు. నా తండ్రికి వృద్ధాప్య పింఛన్ కోసం 27 నెలల తర్వాత దరఖాస్తు స్వీకరించారు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలియదు. నా తమ్ముడి చేతిలో ఇంజినీరింగ్ పట్టా ఉంది. ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల తిరిగాడు. ఉద్యోగమూ లేదు.. భృతీ లేదు.
●నా బాబాయ్ 56 ఏళ్ల వయసులోనూ చేతివృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని చెప్పిన హామీని నమ్మాడు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా అందలేదు. మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం సంగతి సరేసరి. అన్నదాత సుఖీభవ పేరుతో నా భార్య పొలానికి ఏడాదికి రూ.20 వేలు వస్తాయని ఆశించాం. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చినా, సరిపడినన్ని బస్సులు వేయకపోవడంతో ప్రయాణం నరకంగా మారింది.
●అన్నింటికి మించి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో పోలి్చతే నెలకు దాదాపు రూ.5 వేలు అదనంగా ఖర్చవుతున్నాయి. ధరల రెక్కలు విరిచేస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు.
●అందుకే ఈసారి కూటమి నాయకుల బూటకపు మాటలను మళ్లీ నమ్మాలనుకోవడం లేదు. గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయకుండా గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నా. నా ఓటు విలువ నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అది కేవలం వేలిపై వేసే సిరా గుర్తు కాదు. ఐదేళ్ల పాలనకు ఇచ్చే తీర్పు.గతంలో నమ్మి ఓటేశా.. ఇప్పుడు ఆలోచించి ఓటేయాలి.
ఇట్లు..
ఒక సామాన్య ఓటరు
– సాక్షి, రాజమహేంద్రవరం


