
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.
తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.
ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.
ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.
మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.
ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?.
చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.
అంతేకాదు.. ఎన్‌టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.
ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.
2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.