దీక్షలోనూ రాజకీయాలేనా? పవన్‌ సత్యనిష్ఠపై ప్రశ్నలు | Kommineni Srinivasa Rao analysis on Pawan Kalyan comments | Sakshi
Sakshi News home page

దీక్షలోనూ రాజకీయాలేనా? పవన్‌ సత్యనిష్ఠపై ప్రశ్నలు

Jul 1 2026 4:20 PM | Updated on Jul 1 2026 4:31 PM

Kommineni Srinivasa Rao analysis on Pawan Kalyan comments

సాధారణంగా ఏ మతంలో అయినా కొన్ని పవిత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అత్యంత నిష్ఠతో ఉండడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ హిందూ మతంలో ఈ ధర్మాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, దీక్షను కడు శ్రద్ధతో నిర్వహించడం, అబద్ధాలు  చెప్పకుండా ఉండడం, ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండడం వంటి వాటిని ఆచరిస్తుంటారు. 

కానీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష తీసుకున్నా, లేత పసుపురంగు లుంగీ, పైన కండువా వేసుకుని పూజాధికాలు చేసిన తర్వాత  కూడా రాజకీయ ప్రకటనలు చేయడం, అందులోనూ అసత్య వచనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు  కనిపిస్తుండడం భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. 

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ దీక్ష తీసుకున్నారు. ఈ వస్త్రధారణలో ఆయన ఏటా  నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేపడుతుంటారట.. మంచిదే. అది ఆయన  నమ్మకం, విశ్వాసం, దైవభక్తికి సంబంధించిన అంశంగా బావించవచ్చు. దీక్షలు తీసుకున్నవారు చాలా పవిత్రంగా ఉండడానికి యత్నిస్తారు. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష చేసేవారు నల్ల దుస్తులు ధరించి, ఇరుముడి సహా రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు. కేవలం శాఖాహారమే  భుజిస్తారు. మద్యం వంటివాటిని స్వీకరించరు. 

కొందరు కాలినడకన శబరిమలైకి వెళతారు. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు భవానీ దీక్షను తీసుకుని అన్ని నియమాలను పాటిస్తారు. చాలామంది కాలి నడకన సుదూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. శైవభక్తులు కూడా పాదయాత్రలు చేసుకుంటూ శ్రీశైలం వెళ్లి పూజలు చేసి దీక్షను విరమిస్తారు. హిందూ మతంలోనే కాదు.. ఇతర మతాలలో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయి. 

తనకు తానుగా అన్ అపాలిజిటిక్ హిందూ అని, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తినని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో నిబద్దతతో ఉంటారని మత విశ్వాసకులు భావిస్తారు. పవన్ కల్యాణ్ దీక్ష ఆరంభించిన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దీనిని కూడా ఆక్షేపించనక్కర్లేదు. ఆయన పార్టీ అధినేత కనుక కొన్ని తప్పవని అనుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆయన చేసే ఉపన్యాసంలో సత్యనిష్ఠత, నిబద్ధత , నిజాయితీ కొరవడితే అక్కడ ఉన్న సభికులకే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఒక తప్పుడు సంకేతం వెళ్లదా? ఆయన విమర్శకులు వీటిని ప్రస్తావించరా?

అందుకే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టి కూడా అబద్ధాలు చెప్పడం దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారు? అధికారం కోసం కులాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆయన వైసీపీపై విమర్శ చేశారు. కాపులను బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్ గా ప్రొజెక్టు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులోనే కులతత్వం కనబడుతోందన్న సంగతి ఆయన గుర్తించలేకపోయారు. ప్రత్యేకించి ఒక కులం గురించి వైసీపీ నేతలు ఎవరైనా విమర్శ చేసి ఉంటే దానిని ప్రస్తావించి చెప్పాలి కదా! అదేమీ లేకుండా జనరల్ గా మాట్లాడుతున్నారంటే ఆయనలో నిబద్ధత లేదనిపించదా! కాపులను క్రిమినల్స్ గా ఎవరూ చూపించలేదు. కాకినాడ సభలో గాదె సాయికృష్ణ గురించి మాట్లాడుతూ రౌడీ అని ఆరోపించింది ఆయనే. 

అలాగే మరో సభలో సాయికృష్ణపై పోక్సో కేసు ఉందని చెప్పింది పవన్ కల్యాణే. అది తప్పుడు కేసు అని, దానిని కోర్టు కొట్టేసిందని అతని మరదలే చెబుతున్నా, ఆ కేసు గురించి ప్రచారం చేసింది ఆయనే కదా! ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. సాయికృష్ణ పేద కాపు. అతను తప్పు చేస్తే శిక్షార్హుడు. అదే సీఐ నాగరాజు ధనిక కాపు కనుక, పోలీసు అధికారి కనుక ఆయన ఎంత ఘోరం చేసినా సమర్ధిస్తారా? అసలు లాకప్ హత్యలపై పవన్ కు ఒక విధానం ఉందా? అన్నది చర్చనీయాంశం. అంతే తప్ప ఇక్కడ కులం కోణం ఏమీ లేదు. జగన్ టైమ్ లో ఎన్నిసార్లు కులం కోణంలో చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేశారో రికార్డులు చూస్తే తెలుస్తుంది. వైసీపీ వారు కాపు నాయకులతో తనను తిట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కాకినాడలో వైసీపీ నేతలను గూండాలు, రౌడీలు, తొక్కి నార తీస్తా అంటూ అనుచిత భాష వాడిందే పవన్ కల్యాణ్. 

గతంలో వైసీపీ నేతలను ఉద్దేశించి అసభ్య భాష వాడిన విషయం, చెప్పు చూపించిన ఘటనలను ఆయన  మర్చిపోయి ఉండవచ్చు. కాకినాడ స్పీచ్ తర్వాత మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ,అంబటి రాంబాబు, కన్నబాబు, త్రిమూర్తులు తదితరులు దానికి జవాబు ఇచ్చి పవన్ కల్యాణ్ గతంలో కులం పేరుతో ఎలా రాజకీయం చేసింది సోదాహరణంగా వివరించారు.అయినా అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే  పవన్ కల్యాణ్ ఎదుటివారిపై బురద వేయడానికి యత్నించారు. అంతేకాదు..కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం  జగన్‌మోహన్‌ రెడ్డిపై దుర్భాషలాడితే  దానిని నిర్ ద్వంద్వంగా ఖండించి ఉంటే పవన్ కు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తాను ప్రోత్సహించను అంటూనే గత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంతకన్నా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. 

మాజీ మంత్రి కన్నబాబు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన  మాజీ జర్నలిస్టు కూడా. ఆయన ఎప్పుడూ అపసవ్య భాష వాడరు. అయినా పవన్ ఆరోపణ చేయడం అంటే ఏదో రకంగా తన ఎమ్మెల్యే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నమే కదా! తాను కుల రాజకీయాలు చేయలేదని ఆయన అంటున్నారు. ఇకపై కుల రాజకీయం చేయబోనని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. అలా కాకుండా అసలు  కులం గురించి తానెప్పుడు మాట్లాడనట్లు ఉపన్యాసం చెబితే వినే జనం చెవిలో పూలు పెట్టడమే కదా! ఆయన ఎన్నికల సమయంలో  కాపులను ఎలా ఓట్లు అడిగింది, తనకు కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తానని చెప్పిన సంగతులు, ఆంధ్ర భావన లేకపోతే మానే.. కుల భావన అయినా తెచ్చుకోవాలని కోరిన విషయాలన్నీ వీడియోల రూపంలో ప్రత్యక్షం అయ్యాయి. 

మరో వైపు బీసీ కులాలైనా, కాపులైనా ఎవరో అధికారం ఇవ్వాలని కోరుకూడదు, 50 శాతంగా వారు.. వేరే వాళ్లను అధికారం కోసం అడగడం ఏమిటి అని, కలిసి ఉంటే అధికారం వస్తుందని ఆయన సెలవిచ్చారు. మరి దానికి కట్టుబడి ఉండి ఆ దిశలో ప్రయయత్నించకుండా తెలుగుదేశంతో ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏం జవాబు ఇస్తారు. తెలుగుదేశంలో ఎవరి ఆధిపత్యం ఉన్నది ఆయనకు తెలియదా? 

కులం గురించి ఆలోచించే వ్యక్తిని అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ కల్యాణ్ అమాయకంగా ప్రశ్నించినా,  కూటమి ప్రభుత్వ కక్ష, వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీలో చేరింది అందరికి తెలుసు! మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. సంక్షేమ పథకాలతోనే అదికారం రాదని ఆయన అంటున్నారు. అలాంటప్పుడు ఆచరణ సాధ్యంకాని సంక్షేమ స్కీములను చంద్రబాబుతో కలిసి ఎందుకు ప్రకటించారో వివరించగలుగుతారా?వలంటీర్ల పొట్ట కొట్టేవాడిని కానని, వారికి ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగవేయడం గురించి ఏమంటారు? వీటి సంగతి పక్కనబెడితే ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో ఉన్నప్పుడైనా పవన్ కల్యాణ్ నిష్ఠతో, సత్యవచనాలకు కట్టుబడి ఉంటే మంచిది కదా!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement