ఇది ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్‌ పక్షం

Komatireddy Venkat Reddy Comments On BRS - Sakshi

వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు 

బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కోమటి రెడ్డి 

సీఎంగా రేవంత్‌ ఓకే... కానీ తన వాళ్ళతోనే సమస్యన్న కడియం 

మోసం చేయడం బీఆర్‌ఎస్‌కే అలవాటన్న కోమటిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘వీళ్ళది ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్‌ పక్షం’అంటూ మంత్రి కోమటి రెడ్డి, ‘మా వల్ల ఏ ప్రమాదం లేదు... మీ వాళ్ళతోనే జాగ్రత్త’అంటూ సీఎంనుద్దేశించి బీఆర్‌ఎస్‌ సభ్యుడు కడి యం శ్రీహరి పరస్పర విమర్శనాస్త్రాలతో శాసనసభ గురువారం వేడెక్కింది. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పిన అనంతరం అనుబంధ సందేహాలను కడియం శ్రీహరి లేవనెత్తేందుకు స్పీకర్‌ అనుమతించారు.

ఈ దశలో బీఆర్‌ అంబేడ్కర్‌ దళిత బంధు పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కరికీ రూ.12 లక్షలు ఇస్తామన్నారని, బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని ‘ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చి, మోసం చేయడం బీఆర్‌ఎస్‌కే అలవా టు. వీళ్ళు ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్‌ పక్షం. అధికారం పోయిందనే అసహనంతో ఉన్నారు. హరీశ్‌ రావు నేనే సీఎం అయితే అంటున్నాడు. వీళ్ళకు ఏదో సమస్య వచ్చింది. వీళ్ళను దేవుడు కూడా కాపాడలేడు.’’అని వ్యాఖ్యానించారు. 

హోంగార్డు చనిపోతే పట్టించుకోలే: కోమటిరెడ్డి 
’’ఇటీవల జరిగిన నల్లగొండ సభకు వీళ్ల ఎమ్మెల్యే కారణంగా ఓ హోంగార్డు చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కనీసం వీళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని, తన మాట అమలు కాకపోతే తల తీసుకుంటానన్నాడు దీన్ని అమలు చేశారా? మా పార్టీ నుంచి దళితుడు కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేతయితే ఓర్వలేదు.

మా ఎమ్మెల్యేలను కొనేశారు.’అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందుకు కడియం అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘అసహనంతో ఉన్నది మీరే. ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి, తాను పూర్వాశ్రమంలో ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. నేను సీనియర్‌ స్టూడెంట్‌ను. ఆయన జూనియర్‌. రేవంత్‌ సీఎంగా ఉండాలని నా మనసులో ఉంది. కానీ రేవంత్‌ మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మా గురించి మీరు వర్రీ కాకండీ ... మీ వాళ్ళను జర జాగ్రత్తగా చూసుకోండి’అని మాట్లాడటంతో సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 

2 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తారు?: కడియం 
బహిరంగ మార్కెట్లో రుణాలు రూ.59,625 కోట్లు వస్తుందని అంచనా వేశారని, పన్నుల రూపంలో అదనంగా రూ. 20 వేల కోట్లు వస్తుందని చెప్పారని, అయినా ఆర్థిక లోటు రూ.53 వేల కోట్లు రావడానికి కారణమేంటో చెప్పాలని కడియం శ్రీహరి నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇంత వరకూ ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీల్లో యువ వికాసం వదిలేసి, ఐదు హామీలకు బడ్జెట్‌లో రూ. 53,193 కోట్లు కేటాయించారని, ఏ హామీకి ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున, 4.16 లక్షల ఇళ్ళు అవసరమని, ఇంటికి రూ.5 లక్షలు లెక్కన. ఎస్సీ, ఎస్టీ అయితే మరో రూ. లక్ష ఇస్తామన్నారని, ఇవన్నీ కలిపితే, రూ.23 వేల కోట్లపైన అవుతుందన్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపు మాత్రం రూ. 7,750 కోట్లు మాత్రమేనని, ఈ పధకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎస్సీల రిజర్వేషన్‌ 18 శాతం పెంచుతామని ఇచ్చిన హామీపై స్పష్టత ఇవ్వాలన్నారు.  

ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది: పొన్నం 
ఈ దశలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ జోక్యం చేసుకుని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపించారు. పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ను నియమించామని, ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top