
సాక్షి,అమరావతి: ‘నా సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నా కల్యాణ మండపంలో కాసినోలు, జూదాలు జరిగాయని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటా. నిరూపించలేకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుం టావా’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కు మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మరో మారు సవాల్ విసిరారు. ‘చంద్రబాబు నిర్ణయం కోసం పది రోజులు వేచి చూస్తా. అప్పటిలోగా నిరూపించలేకపోతే అక్కడ కాసినోలు జరగలేదని అంగీకరించినట్టే. అబద్ధాలు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, ఆయన కుల మీడియా క్షమాపణలు చెప్పాలి. నా కల్యాణ మండపం దగ్గర సీసీ కెమెరాలున్నాయి.
సీసీ ఫుటేజ్‌ని నేనే మీడియాకు విడుదల చేస్తా. కాసినో,జూదం జరగలేదని నిరూపిస్తా. చంద్రబాబు, ఆయన కుల మీడియా ఎన్ని కుట్రలు చేసినా నన్నేమీ చేయలేరు’ అని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘గుడివాడలో కాసినోలు, జూదాలు జరిగాయని చంద్రబాబు కుల మీడియాలో అబద్ధపు వార్తలు రాశారు. దానిపై నిజనిర్థారణ కమిటీ వేసి, బోండా ఉమాను పంపించారు. అక్కడి ప్రజలే వారిపై తిరగబడి ఏం శాస్తి చేశారో అనుభవపూర్వకంగా చూశారు. కాసినోలు జరిగాయని ఆరోపణలు చేసింది బాబు, ఆయన కుల మీడియా. కమిటీ వేసింది చంద్రబాబు. మా కులానికి, మా కుల మీడియాకు వ్యతిరేకంగా చంద్రబా బును కాదని, సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని వీళ్లంతా ఏకమై నిందలు వే స్తున్నారు.
ఎక్కడో తీసిన విజువల్స్, ఫొటోలను తీసుకొచ్చి నా కల్యాణ మండపంలో జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌లలో వ్యభిచారం జరుగుతున్నదని నేను ఆరోపించి, పదిమందితో నేనే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తే, వాటిలో ఏం జరుగుతోందో చంద్రబాబు చూపిస్తారా? హెరిటేజ్ ఫ్రెష్‌లలో తిరిగేందుకు అనుమతిస్తారా? ఎవరింట్లోకి వచ్చి నిర్థారణ చేస్తారు? మీ కుల మీడియాలో మీరే అడ్డగోలు రాతలు రాసుకుని, మీరే కమిటీలు వేసుకుని, మీరే వ చ్చి నిజ నిర్థారణ చేస్తారా? బోండా ఉమ, వర్ల రామయ్యకు ఏం సంబంధం? చేతనైతే చంద్రబాబు నిరూపించాలి’ అని అన్నారు. ‘సంక్రాంతి నాడే కాదు, చిన్న ఫంక్షన్లలో కూడా ఈ రోజుల్లో చాలా మంది సినిమా పాటలకు రికా ర్డింగ్ డ్యాన్సులు వేయిస్తున్నారు. టీడీపీ మీటింగుల్లో కూడా పాటలు పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారు. వాటన్నింటినీ చంద్రబాబు ఆపేయిస్తారా?’ అని నాని ప్రశ్నించారు.
బాబు హయాంలో పేకాట క్లబ్బులు..
‘చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పేకాట శిబిరాలు, వ్యభిచార వృత్తులు నడిపే వేల కోట్లు సంపాదించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో క్లబ్‌లు నడిపిన వ్యక్తి. వాటిని ఎమ్మెల్యేలకు అప్పగించి, తన కొడుకు లోకేశ్ ద్వారా డబ్బులు వసూలు చేసి బతికిన వ్యక్తి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక క్లబ్‌లన్నింటినీ మూసేయించారు. అటువంటి చంద్రబాబు, ఆయన తాబేదారులు, ఆయన కుల మీడియా కాసినోలు, జూదాల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోయి ఇక్కడకు పారిపోయి వచ్చిన దొంగ బాబే అటువంటి పనులు చేయగలరు. మరెవరూ చేయలేరు’ అని చెప్పారు.