కుప్పం నుంచి గెలిచే సత్తా ఉందా!

Kodali Nani Comments On Chandrababu Naidu - Sakshi

బాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా 

ప్రజల్లో నవ్వుల పాలవుతామనే భయంతోనే బహిష్కరణ డ్రామా 

పారిపోవడం చంద్రబాబు రక్తంలోనే ఉంది 

మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం నుంచి తిరిగి గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్‌ చేశారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. సవాల్‌ చేసి పారిపోవడమన్నది చంద్రబాబు రక్తంలో నరనరాల్లో జీర్ణించుకుపోయిందని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పరిషత్‌ ఎన్నికల్లో 99 శాతం జెడ్పీటీసీ స్థానాలను, 85 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుని ఆఖండ విజయం సాధించిందని నాని పేర్కొన్నారు.

2020 మార్చిలో మూడు రోజుల్లో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనగా అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ వాయిదా వేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు భయపడిన చంద్రబాబు తన తొత్తు అయిన నిమ్మగడ్డతో రాష్ట్రంలో మూడు కరోనా కేసులున్నాయనే సాకుతో వాయిదా వేయించి చంద్రబాబు పారిపోయారని గుర్తు చేశారు. చివరకు కుప్పం నియోజకవర్గంలోను, సొంతూరు నారా వారిపల్లెలోను, ఎన్టీఆర్‌ సొంతూరు నిమ్మకూరులోను, ఎన్టీఆర్‌ అత్తగారి ఊరులోను, దత్తత గ్రామం కొమరవోలులోను ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబుకు అర్థమైందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అడ్డుకోలేమని, ఎన్నికలు జరిగితే ప్రజల్లో నవ్వుల పాలవుతామనే భయంతో బహిష్కరణ డ్రామాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.  

 
అప్పుడే ఎందుకు బహిష్కరించలేదు 

పరిషత్‌ ఎన్నికల్లో చంద్రబాబు బీ ఫారాలు ఇచ్చి టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్నికలను నిమ్మగడ్డ నిలిపివేస్తారని తెలిసే.. ఎన్నికల నుంచి దొడ్డిదారిన పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడా ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనను ప్రజలు దీవించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిస్తే.. తామే గెలిచామంటూ పార్టీ కార్యాలయం ముందు టపాసులు కాల్చుకున్నారని ఎద్దేవా చేశారు.

ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పచెప్పేసి.. పారిపోయి వచ్చి కాలువ గట్టన దాక్కున్న చంద్రబాబు.. కరోనా వస్తే హైదరాబాద్‌లో ప్యాలెస్‌లో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు  చెప్పే మాటలను టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాలని.. ఇలాంటి పప్పుగాడిని.. తుప్పుగాడిని నమ్ముకుంటే టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే ఏపీలో కూడా పడుతుందని అన్నారు. చంద్రబాబును నాయకత్వం నుంచి తీసేసి.. ఆ గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. 
 
జగన్‌ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా.. 
పప్పుగాడు లోకేశ్‌తో మొదలుపెట్టి గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు వరకూ సీఎం వైఎస్‌ జగన్‌ను, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని, కొడుకు పప్పుగాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలనన్నారు. ‘కాకపోతే మా సీఎం వైఎస్‌ జగన్‌.. పోనీలే నానీ అన్నా. వాళ్లను వదిలెయ్‌. చంద్రబాబు పగా, ప్రతీకారాలతో నన్ను ఏదో చేయాలని, అతని అధికారాన్ని దొంగతనంగా నేనేదో తీసుకున్నట్టుగా నన్ను భరించలేకపోతున్నాడు. అతడు, అతని కొడుకు, ఆ పార్టీలో సంబంధించిన గాలి వ్యక్తులు నా మీద, ఈ ప్రభుత్వం మీద ఇష్టమొచ్చినట్టు నిందలు, బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రజలు మన ప్రభుత్వానికి, పార్టీకి మద్దతుగా ఉన్నారు. పైన ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి, వాళ్ల అవసరాలు తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చాం. అందువల్ల మనం అలాంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుందాం అని ఒకటికి పదిసార్లు చెప్పారు. అందుకే తుప్పుగాడిని, ఆ పప్పుగాడుని వదిలేస్తున్నా’ అని కొడాలి చెప్పారు. 
 
కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ను ప్రోత్సహించిందెవరు? 
మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయిందంటూ హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు ఆరోపిస్తున్నారని మంత్రి నాని మండిపడ్డారు. ‘కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్లను మీరే ప్రోత్సహించిన విషయం ప్రజలందరికీ తెలుసు. డబ్బులు అప్పులుగా ఇచ్చి మహిళల్ని వ్యభిచార కూపంలో దించడానికి మీ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్నో దుర్మార్గాలు చేశారు. నువ్వు వాటన్నింటినీ ప్రోత్సహించావు. అప్పటి విజయవాడ సీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను సెలవు మీద పంపించావు. చేతగాని, అసమర్థ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందావు. కాబట్టే.. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు ఇచ్చి.. నీ కొడుకును కృష్ణా నదిలో కలిపారు’ అని ఎద్దేవా చేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top