
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్రమంత్రి, ఆ పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని.. ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు.
ఈ మేరకు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉందని అన్నారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని చెప్పారు. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారన్నారు.ఎల్పీ నేత ప్రకటన అమిత్ షా వచ్చిన రోజే ప్రకటించాల్సిందని.. ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేతపై ప్రకటన చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
మహిళలకు, బీసీలకు ఎంపీ టికెట్లలో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్‌లో లీడర్ ఎవరో తెలియదని.. బీజేపీకి ఓటేసేందుకు జనాలు సిద్దంగా ఉన్నారని అన్నారు.