
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో సంఘీభావం ప్రకటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో రాంచందర్‌రావు, బీబీ పాటిల్, ఆర్.కృష్ణయ్య, ఈటల, ఏలేటి తదితరులు
ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను యథాతథంగా అమలుచేయాలి
ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకోం
ఇందిరాపార్కు బీసీల మహాధర్నాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సీఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: ఎన్.రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఆయా వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపాదిత 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీల మహాధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, వాస్తవంగా 32 శాతం రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌నాయకులు అసత్య ప్రచారం చేస్తూ, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు.
సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు సంబంధం లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో జంతర్ మంతర్ వద్ద నిరసన డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు చీవాట్లు పెట్టాక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చారని అన్నారు.
రిజర్వేషన్లు అమలు చేయకుంటే సీఎం భరతం పడతం
రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి భరతం పడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాంలో బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారని, బీసీల కళ్లలో మట్టి కొట్టిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆయా వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.
ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ..బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243– ఈ (6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. బీసీలకు మేలు చేయకూడదన్న ఎజెండాతోనే కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరిచ్చే 42 శాతం రిజర్వేషన్లను కోర్టులు ఆపుతున్నాయా..? ఢిల్లీ ఆపుతుందా..?’అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా.కాసం వెంకటేశ్వర్లు, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.