
ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి
చేనేత దినోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
చేనేత పరిశ్రమను జీడీపీలో 5 శాతానికి తీసుకెళ్లాలి
ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ఉత్పత్తులే ఉండాలి
మాదాపూర్ (హైదరాబాద్): దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఒకటి రాష్ట్రంలోని వరంగల్‌లో ఏర్పాటు కానుందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో వేల కోట్లలో పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎత్నిక్ హాల్‌లో ఆదివారం నేషనల్ హ్యాండ్లూమ్ డే నిర్వహించారు. హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్, హ్యండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయం తర్వాత చేనేతే..
‘దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది చేనేత రంగం. దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. మన చేనేత ఉత్పత్తులు ఎంతో నాణ్యత, నైపుణ్యంతో తయారు చేసినవి. విదేశాల్లోని పలు విమానాశ్రయాలు, ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లలో కూడా మన దేశానికి సంబందించిన, రాష్ట్రానికి సంబందించిన పట్టు చీరలు, చేనేత ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. సుమారు 5 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల చేనేత పరిశ్రమకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
తెలంగాణ చీరలు, తివాచీలకు జీఐ ట్యాగ్
తెలగాణలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట కాటన్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ తివాచీలకు జీఐ ట్యాగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కార్మీకులను మరింత ప్రోత్సహించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలి. ప్రపంచ మార్కెట్‌లో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
దేశంలో చేనేత పరిశ్రమ జీడీపీలో 2.3 శాతంగా ఉంది. దీనిని 5 శాతం వరకు తీసుకువెళ్ళాలి. ఇందుకు ప్రతి చేనేత కార్మీకుడు పట్టుదలతో కృషి చేయాలి. నైపుణ్యం పెంచుకోవాలి. శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అలా చేస్తే రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా భారతదేశంలో తయారైన ఉత్పత్తులే అందుబాటులో ఉంటాయి..’అని కిషన్‌రెడ్డి చెప్పారు.
చేనేత దుస్తులు ధరించాలి
‘మన ఉత్పత్తులను బయటి దేశాలలో అమ్మకాలు చేస్తుంటే, కొందరు అక్కడ కొనుగోలు చేసి మన దేశానికి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాడే ప్రతి వస్తువు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నట్టు ఉండాలి. ప్రతి కుటుంబం నెలకు వారం రోజులు చేనేత దుస్తులు ధరించాలి..’అని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.
పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింది సుదర్శన్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. చేనేత కళాకారులకు సర్టిఫికెట్‌లు అందజేశారు. చేనేత మగ్గాలను, ఉత్పత్తులను తిలకించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు, నిప్ట్ డైరెక్టర్ మాలిని, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.