శశి థరూర్‌పై సొంత పార్టీ నేత ఘాటు విమర్శలు

Kerala MP Slams Shashi Tharoor He Is Guest Artist in Congress Party - Sakshi

తిరువనంతపురం: ఎంపీ శశి థరూర్‌ రాజకీయ నాయకుడు కాదని, ఆయన ‘గెస్ట్‌ ఆర్టిస్టు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోడిక్కున్నిల్‌ సురేశ్‌ విమర్శించారు. పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ స్వపక్ష నేతకు హితవు పలికారు. కాగా నాయకత్వ మార్పు, పార్టీలో సంస్కరణలు కోరుతూ అధినాయకత్వానికి లేఖ రాసిన 23 మంది నేతల లిస్టులో శశి థరూర్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో చీఫ్‌ విప్‌, కేరళ ప్రదేశ్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘శశి థరూర్‌ అసలు రాజకీయ నాయకుడే కాదు. కాంగ్రెస్‌ పార్టీలోకి గెస్ట్‌ ఆర్టిస్టుగా అడుగుపెట్టారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. ఆయన గ్లోబల్‌ సిటిజన్‌ అయి ఉండవచ్చు. (చదవండి: కాంగ్రెస్‌ విషయం తేల్చిపడేసిన ఆజాద్‌)

అంతమాత్రాన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. అంతిమంగా ఎవరైనా సరే పార్టీ నియమాలు, నిబంధనలకు అనుగుణంగానే నడచుకోవాలి’’అని ఘాటుగా విమర్శించారు. కాగా గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్‌ తివారి, జితిన్‌ ప్రసాద, శశి థరూర్‌ తదితర 23 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధినాయత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది. ఈ సందర్భంగా గాంధీ కుటుంబ విధేయులు అసమ్మతి నేతల తీరును ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలకు సీడబ్ల్యూసీ సమావేశంలో తాత్కాలికంగా బ్రేక్‌ పడినప్పటికీ అసమ్మతి నేతలపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.(చదవండి: ఇది దురదృష్టకరం: కపిల్‌ సిబల్‌)

అందుకే మౌనంగా ఉన్నా: శశి థరూర్‌
కేపీసీసీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ కె. మురళీధరన్‌ సైతం థరూర్‌ గురించి గురువారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరాశకు గురైందని, థరూర్‌ మద్దతుతోనే కేంద్రం తిరువనంతపురం ఎయిర్‌పోర్టును అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన థరూర్‌.. ‘‘గత నాలుగు రోజులుగా నిశ్శబ్దంగా ఉంటున్నాను. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ చెప్పినందు వల్లే ఈ మౌనం. పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేయాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్చను ఇంతటితో వదిలేయాలని నా సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నా’’అని ట్వీట్‌ చేశారు. కాగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటుకు అప్పజెప్పాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మద్దతు ఇవ్వడం కేరళలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.(చదవండి: ఎయిర్‌పోర్ట్‌ వివాదం.. కేరళ మంత్రికి శశి థరూర్‌ రిప్లై)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top