
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
గత గురువారం కూడా బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.
మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్‌ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.