
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్తూ నాలుగు నెలలపాటు యాత్ర చేపడుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
నాలుగు నెలల యాత్రతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉద్యమకారులు,అమరవీరుల త్యాగాలకు అర్ధం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. అందుకే యాత్రను చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఉండబోదు అని అన్నారామె. అయితే..
ఇది కేసీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం నాకు లేదు. ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు. నేను నా తొవ్వను వెతుక్కుంటున్నా. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఫొటోతో ప్రజల్లోకి వెళ్లలేను అని స్పష్టత ఇచ్చారామె.
అక్టోబర్ 25 2025 నుంచి నుంచి ఫిబ్రవరి 13 20206 వరకు నాలుగు నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం జరగనుందని కవిత ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటన చేస్తూ బీఆర్‌ఎస్‌ను వీడే సమయంలో కేసీఆర్ ఫొటోతోనే తాము భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామంటూ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే.