బాబూ.. మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?  | Jaggampeta MLA Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? 

Feb 17 2023 5:21 AM | Updated on Feb 17 2023 5:21 AM

Jaggampeta MLA Fires On Chandrababu - Sakshi

జగ్గంపేట: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఉన్న ఆస్తులు, ఇప్పటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే  జ్యోతుల చంటిబాబు సవాల్‌ చేశారు. చంద్రబాబునాయుడు జగ్గంపేటలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తనపై  చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జగ్గంపేటలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

తనపై చేసిన అవినీతి ఆరోపణల్ని చంద్రబాబునాయుడు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాజకీయ వ్యభిచారం చేసేవారు రాసిచ్చిన స్క్రిప్టు చదివేటప్పుడు చంద్రబాబు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.

రూ.35 కోట్లు తీసుకుని పార్టీ ఫిరాయించిన వ్యక్తుల వల్లే జగ్గంపేటలో టీడీపీ నాశనమైందని పరోక్షంగా జ్యోతుల నెహ్రూను, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ను విమర్శించారు. చంద్రబాబుకు విలువలు లేవని, పార్టీని నమ్ముకున్నవారిని ముంచేసి సర్వనాశనం చేస్తారని, దానికి తానే నిదర్శనమని చెప్పారు. రెండుసార్లు టీడీపీ నుంచి పోటీచేసి ఆర్థికంగా నష్టపోయానన్నారు.

విలువ, చిత్తశుద్ధిలేని రాజకీయాలను భరించలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక 2017లో టీడీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అన్నమాటకు కట్టుబడి విలువలతో కూడిన రాజకీయం చేయడం దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్షణమని, సీఎం జగన్‌ది అదే లక్షణమని తెలిపారు. అందుకే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నైజం చంద్రబాబుదని విమర్శించారు. జిల్లాలో చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుంటే నష్టపోతారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement