
సాక్షి, హైదరాబాద్: సహారా ఫైల్ కదిలించి, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యవహారాన్ని బయటపెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, భూకబ్జాలపై త్వరలో చిట్టా విప్పుతామని చెప్పారు. హుజూరాబాద్ స్థానానికి ఈటల రాజీనామా చేస్తే అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటారని బండి సంజయ్ పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన దీక్షలో భాగంగా బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి దీక్ష చేశారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొని, నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ, బెంగాల్‌ను బంగ్లాదేశీయులకు అప్పగించే కుట్ర జరుగుతోందని, ఎన్నికల ఫలితాల తరువాత 18 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు బెంగాల్‌లో కరసేవ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
( చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ )