Huzurabad: గులాబీ గూటికి ముద్దసాని కశ్యప్‌ రెడ్డి

Huzurabad: Muddasani kashyap reddy Joins In TRS - Sakshi

2014లో టీడీపీ నుంచి పోటీ

మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి తనయుడిగా గుర్తింపు

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి వర్గం నుంచి టీఆర్‌ఎస్‌లోకి..

సాక్షి, కరీంనగర్‌: త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత ముద్దసాని దామోదర్‌ రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి గు లాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గీయుడిగా గుర్తింపు పొందిన కశ్యప్‌ రెడ్డి సోమవారం మంత్రులు టి.హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతున్న పరిస్థితుల్లో కశ్యప్‌ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. 

2014లో టీడీపీ నుంచి కశ్యప్‌ పోటీ 
మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి మరణం తరువాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కశ్యప్‌రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్‌ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కశ్యప్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. తరువాత పరిణామాల్లో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి అనుయాయుడిగా వ్యవహరించిన కశ్యప్‌ రెడ్డి.. ఆయనతో పాటే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేవంత్‌రెడ్డి ద్వారా విఫలయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాడి కౌశిక్‌ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

ఈ పరిస్థితుల్లో కశ్యప్‌ రెడ్డి చేరికతో ‘వచ్చే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా విజయం కోసం కృషి చేస్తా’ అని స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు కశ్యప్‌ రెడ్డి బాబాయ్‌ ఐఏఎస్‌ రిటైర్డ్‌ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు హుజూరాబాద్‌ అభ్యర్థి కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా టికెట్టు ఇస్తే పోటీ చేయాలనే నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది.

చదవండి: Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top