Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?!

Huzurabad: TRS To Set Candidate For Bypoll Who Is Purushotham Reddy - Sakshi

హుజూరాబాద్‌ అభ్యర్థి  అన్వేషణలో టీఆర్‌ఎస్‌

పరిశీలనలో ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు

మాజీ మంత్రి దివంగత దామోదర్‌ రెడ్డి సోదరుడే పురుషోత్తం

కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు పురుషోత్తం రెడ్డి కలెక్టర్‌

ప్రస్తుతం వీటీడీఏ చైర్మన్‌గా సేవలు

ఆశల పల్లకిలో మరికొందరు నేతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన హుజూరాబాద్‌లో దీటైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్‌ అన్వేషణ సాగిస్తోంది. స్థానిక పరిస్థితులు, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా కమలాపూర్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు ముద్దసాని దామోదర్‌ రెడ్డి కుటుంబాన్ని కూడా టీఆర్‌ఎస్‌ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దామోదర్‌రెడ్డి సోదరుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన పురుషోత్తం రెడ్డికి నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలిచిన తరువాత 2010లో ఆ జిల్లా కలెక్టర్‌గా పురుషోత్తం రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తూనే రిటైర్డ్‌ అయిన తరువాత 2013లో పే రివిజన్‌ కమిషన్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) చైర్మన్‌గా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నారు. 

ఈటలకు ముద్దసానితో చెక్‌ పెట్టాలని..
రాష్ట్రంలో కీలకనేత అయిన ముద్దసాని దామోదర్‌ రెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్‌ చేతిలో 2004లో ఓటమి చెందారు. ఆ తరువాత మళ్లీ తెరపైకి రాలేదు. 2008, 2010 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో ఈటలకు పోటీ ఇవ్వలేకపోయారు. దామోదర్‌ రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి 2014లో హుజూరాబాద్‌ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు.

ఈ పరిస్థితుల్లో దామోదర్‌ రెడ్డి సోదరుడైన పురుషోత్తం రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని టీఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో బలమైన ‘రెడ్డి’ సామాజిక వర్గంతోపాటు ముద్దసాని కుటుంబం పేరు, మాజీ ఐఏఎస్‌ హోదా కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే.. నిఘా వర్గాల సమాచారంతోపాటు సొంతంగా టీఆర్‌ఎస్‌ చేయిస్తున్న సర్వేలో ముద్దసాని పురుషోత్తం రెడ్డి ఎంత వరకు ‘ఫిట్‌’ అవుతారో చూడాలి. 

ఆశల పల్లకిలో మరికొందరు..
హుజూరాబాద్‌లో ఈటలకు దీటైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్‌ అన్వేషణ సాగిస్తున్న నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీ టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈటలపై పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు 2014 నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఈటల ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చిన తరువాత కొద్దిరోజులుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీసీకి టికెట్టు ఇవ్వాల్సి వస్తే తనకే అవకాశం వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి టికెట్టు ఇవ్వాల్సి వస్తే హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ నుంచి ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీలోకి ఈటల రాకతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అవకాశం వస్తే టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే యోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి పేరు గతంలో ప్రచారంలోకి వచ్చినా, ఆయన కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని ఖరాఖండిగా చెపుతుండడం గమనార్హం. కౌశిక్‌కు వరుసకు సోదరుడు అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. బీసీ అభ్యర్థికి సీటివ్వాల్సి వస్తే తన పేరు కూడా పరిశీలించాలని హుజూరాబాద్‌ సీనియర్‌ నాయకుడు పొనగంటి మల్లయ్య కూడా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్‌లో ముద్దసాని చెరగని ముద్ర
తెలుగుదేశం పార్టీ నుంచి 1985లో తొలిసారి కమలాపూర్‌ ఎమ్మెల్యేగా ముద్దసాని దామోదర్‌ రెడ్డి విజయం సాధించారు. తరువాత 1989, 1994, 1999లలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం ఆయన విజయపరంపర కొనసాగింది. ఎన్‌టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, కరీంనగర్‌ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓడిపోయిన ఆయనకు తిరిగి విజయం దక్కలేదు. నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన ముద్దసాని కుటుంబానికి స్థానికంగా మంచిపేరుంది.

దామోదర్‌ రెడ్డి కరీంనగర్‌ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా ముద్దసాని దామోదర్‌ రెడ్డి రాజకీయాల్లో ఉండగా, ఆయన సోదరుడైన పురుషోత్తం రెడ్డి రాజకీయాలకు దూరంగా ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. గ్రూప్‌ –1 అధికారి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ కేసీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. 2012లోనే దామోదర్‌ రెడ్డి మరణించగా, పురుషోత్తం రెడ్డి మాత్రం రిటైర్డ్‌ అయిన తరువాత కూడా ప్రభుత్వానికి తన సేవలందిస్తున్నారు.

చదవండి: తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top