Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి..

Huzurabad Bypoll K Chandrashekhar Rao Announces Gellu Srinivas Yadav As TRS Candidate - Sakshi

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ఖరారు చేసిన కేసీఆర్‌

కలిసి వచ్చిన ఉద్యమ, కుటుంబ నేపథ్యం, సామాజికవర్గం సమీకరణాలు 

బీజేపీ నేత ఈటలకు బీసీ విద్యార్థి నేతతో చెక్‌పెట్టే వ్యూహం 

అభినందించిన హరీశ్‌రావు, కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్య ర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు వెళ్లారు.

క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం, సేవాభావం, నిబద్ధతను గుర్తించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం గెల్లు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు’’ అని టీఆర్‌ఎస్‌ బుధవారం ప్రకటన విడుదల చేసింది. తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి హరీశ్‌రావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన మరో విద్యార్థి నాయకుడు ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఆచితూచి లెక్కలు వేసి..! 
ఈటల రాజీనామా నాటి నుంచీ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్‌.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు కొత్తతరం నాయకత్వంతో చెక్‌ పెట్టాలనే ఆలోచనతో గెల్లు శ్రీనివాస్‌ పేరు తెరమీదకు వచ్చినట్టు సమాచారం. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, నాయకులను కాదని మరీ గెల్లు శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం గమనార్హం.

నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చిన తర్వాతే అభ్యర్థి పేరును ప్రకటించారు. వాస్తవానికి వారం రోజుల కిందటే అభ్యర్థి ఖరారైనా ఆషాఢం సెంటిమెంట్‌తో తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. ‘‘కేసీఆర్‌ తలచు కుంటే సాధారణ కార్యకర్తలను ఏ స్థాయికైనా తీసుకెళ్లగలరు. కేసీఆర్‌ ఆశీస్సులతోనే ఈటల ఎదిగారు. ఆర్థిక, అంగబలంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అభ్యర్థిగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగుతున్న రాజేందర్‌పై సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా కేసీఆర్‌ తెగువను, రాజకీయ చతురతను చూపారు’’ అని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

బీసీ కోణంలో.. 
‘ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. హైదరాబాద్‌లో ఓసీ’ అనే నినాదంతో టీఆర్‌ఎస్‌ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  పార్టీ అభ్యర్థిత్వం కోసం కేసీఆర్‌ వివిధ సామాజికవర్గాలకు చెందిన పలువురి పేర్లను పరిశీలించారు. వివిధ సర్వేలు, నివేదికలను పలు కోణాల్లో మదింపు చేశారు. చివరిగా బీసీ (యాదవ) సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ వైపు మొగ్గు చూపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఓట్లపరంగా యాద వులు మూడోస్థానంలో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశమని పార్టీ శ్రేణులు భావి స్తున్నాయి. గెల్లు శ్రీనివాస్‌ తండ్రి మల్లయ్య పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు.

ఎంపీటీసీగా, పార్టీ మండల ఉపాధ్యక్షుడు, జిల్లా గొల్ల కురుమల సహకార సంఘం డైరెక్టర్, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వంటి పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో గెల్లు శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్వీలో చురుగ్గా పనిచేశారు. ఉద్యమ సమయంలో 127 కేసులు ఎదుర్కొన్నారు. కుటుంబ నేపథ్యం, ఉద్యమంలో పాల్గొనడం, విద్యాధికుడు కావడం, పార్టీ పట్ల విధేయుడిగా ఉండటం, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందినవాడు కావడం వంటివి గెల్లు శ్రీనివాస్‌ ఎంపికలో కీలకపాత్ర పోషించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

అన్ని రకాలుగా సంసిద్ధమై.. 
మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక తదితర పరిణా మాల నేపథ్యంలో ఈ ఏడాది మే తొలివారం నుంచే హుజూరాబాద్‌పై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారు. టీఆర్‌ఎస్‌ యంత్రాంగం చేజారకుండా కట్టడి చేయడంతోపాటు విపక్షాల నేతలను చేర్చుకునే బాధ్యతను మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లకు అప్పగించారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. నియోజక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డి తదితరులను టీఆర్‌ఎస్‌ చేర్చుకున్నారు. 

పనిమనిషిలా సేవ చేస్తా: గెల్లు శ్రీనివాస్‌ 
ఇల్లందకుంట (హుజూరాబాద్‌): తాను నిరుపేదనని, రెండు గుంటల భూమి మినహా ఇంకేం లేదని.. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పనిమనిషిలా సేవ చేస్తానని హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి« గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఇల్లందకుంటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేశానని చెప్పారు. 2001 నుంచీ విద్యార్థుల సమస్యలపై పోరాటా ల్లో, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా నని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు తనపై 120 కేసులు పెట్టారని, 28 రోజులు జైల్లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో మొదటి నుంచీ క్రియాశీలకంగా పనిచేసిన నిరుపేద బిడ్డకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించడం ఆయన గొప్పతనానికి నిదర్శమన్నారు. డబ్బులు, ఆస్తి లేకున్నా తనకు టికెట్‌ ఇచ్చారని.. పార్టీలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.  

పేరు    :    గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ 
తండ్రి    :    గెల్లు మల్లయ్య   (మాజీ ఎంపీటీసీ, కొండపాక) 
తల్లి    :    లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్‌నగర్‌) 
పుట్టినతేదీ    :    21–08–1983 
విద్యార్హతలు    :    ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం) 
సామాజికవర్గం    :    బీసీ (యాదవ) 
ప్రస్తుత హోదా    :    టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top