Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే..

Huzurabad Bypoll 2021 Results Reasons For TRS Defeat - Sakshi

ఆదుకోని దళితబంధు

తీవ్ర ప్రభావం చూపిన నిరుద్యోగుల అసంతృప్తి

ఈటల పట్ల కేసీఆర్‌ తీరుపై జనాల్లో అసంతృప్తి

ఈటలకు కలిసివచ్చిన సెంటిమెంట్‌

సాక్షి, వెబ్‌డెస్క్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. హుజురాబాద్‌ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్‌ ముందు.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఫుల్లు ఖుషీగా ఉంది. 

మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్‌ ఎన్నిక ఏకంగా కేసీఆర్‌ వర్సెస్‌ ఈటలగా సాగింది. కారు గుర్తు అభ్యర్థి గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ ముఖ్యులంతా రంగంలోకి దిగారు. ఇక ఈ ఉప ఎన్నికలో గెలవడం కోసం టీఆర్‌ఎస్‌  దళితబంధు వంటి భారీ ప్రజాకర్షక పథకాన్ని ప్రకటించింది. 

దళితబంధు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను కూడా హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు, మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు చేశారు. ఇక ఓట్ల కోసం డబ్బులు ఇష్టారీతిన వెదజల్లారు. ఏకంగా ఒక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ ఏకంగా 2000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇంత చేసినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. ఈ ఫలితం టీఆర్‌ఎస్‌పై ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఈటల పట్ల కేసీఆర్‌ తీరు కూడా సరికాదని జనం తమ ఓట్లతో చెప్పకనే చెప్పారు. 

ఇక టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే..

ఈటల పట్ల కేసీఆర్‌ వ్యవహరించిన తీరు
ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం.. వాటిపై కేసీఆర్‌ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈటల 100 ఎకరాల భూమిని కబ్జా చేశాడనే ఆరోపణలు వచ్చిన వెంటనే కేసీఆర్‌ స్పందించారు. కలెక్టర్‌ ద్వారా సమగ్ర రిపోర్ట్‌ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజీనామా చేశారు. 

ఈటల వ్యవహరంలో కేసీఆర్‌ తీరుపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకు కొన్ని రోజుల ముందే ఓ మంత్రిపై భూకబ్జా ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్పింగ్‌ వైరల్‌గా మారింది. కేసీఆర్‌ ఆ వ్యవహారాన్ని కనీసం పట్టించుకోలేదు. కానీ ఈటల విషయంలో హుటాహుటిన దర్యాప్తుకు ఆదేశించారు. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల ఒకరకంగా.. వెనకబడిన తరగతికి చెందిన నాయకుడి పట్ల మరో రకంగా ప్రవర్తించినట్లుగానే జనాల్లోకి వెళ్లింది. 

ఆదుకోని దళితబంధు..
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్‌ గెలుపు వ్యూహాలు రచించారు. దానిలో భాగంగానే హుజూరాబాద్‌లో బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న దళితులను ఆకర్షించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించేలా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌నే ఎన్నుకుని..1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల వరకూ నిధుల కేటాయించారు. ఇక బీసీ ఓట్లు చీలినా.. దళిత ఓట్లు అన్ని కారు గుర్తుకే అని కేసీఆర్‌ ధీమాగా ఉన్నారు.

అయితే  ఓట్ల కోసం కేసీఆర్‌ తీసుకువచ్చిన దళిత బంధు పథకం.. బెడిసికొట్టి కారుకే షాకిచ్చింది. ఇది కేవలం ఓట్ల కోసమే తీసుకువచ్చినట్లు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇక ఈ పథకంపై మిగతా సామాజిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. పేదలు అంటే కేవలం దళితులు మాత్రమే కాదు..  మిగతా సామాజిక వర్గాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి వారి అభివృద్ధి సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా అన్ని వర్గాలకు దళితబంధు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ... కేసీఆర్‌ను ఇరుకునపెట్టాయి. 

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్‌ అందరికి దళితబంధు ఇస్తానని ప్రకటించాడు. కానీ ఎన్నికలకు ముందు హైకోర్టు దళితబంధుపై స్టే విధించింది. దాంతో జనాల్లో.. ఇది కూడా జీహెచ్‌ఎంసీ వరద సాయం మాదిరి మూలనపడుతుందనే అభిప్రాయం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దళితబంధు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందనే విషయం స్పష్టంగా అర్థం అయ్యింది.

నిరుద్యోగుల అసంతృప్తి..
ఇక టీఆర్‌ఎస్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. 2018లో వచ్చిన పోలీస్‌ నోటిఫికేషనే తెలంగాణలో చివరి భారీ నోటిఫికేషన్‌. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో 80 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. కానీ వాటి భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మూడేళ్ల నుంచి ఉద్యోగ ప్రకటన లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి.. రానున్న రోజుల్లో వెలువడే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కోల్పోనున్నారు.

దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అలానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ కారణలన్ని నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతకు కారణమయ్యాయి. వెరసి హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కారు ఓటమికి నిరుద్యోగ యువత కూడా ఓ కారణంగా నిలిచారు. 

ఇదే కాక కాంగ్రెస్‌ క్యాడర్‌ బీజేపీకి సహకరించిందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తమకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు.. కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవకూడదని బలంగా నిశ్చయించుకున్న కాంగ్రెస్‌.. బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూ... ఈటలకు భారీ విజయం దక్కేలా చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top