అమిత్‌ షా కాదు.. అబద్ధాలకు బాద్‌షా 

Harish Rao Fires On Amit Shah - Sakshi

మీరేం మాట్లాడినా చెల్లేందుకు ఇది గుజరాత్‌ కాదు 

కేంద్ర హోం మంత్రిపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ 

దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ 

తూప్రాన్‌: ‘అమిత్‌ షా కాదు.. అబద్ధాలకు బాద్‌షా’అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం లేదన్నారు. ‘మీరు ఏది మాట్లాడినా చెల్లేందుకు ఇది గుజరాత్‌ కాదు. తెలంగాణ గడ్డలో బీజేపీ అబద్ధాలు చెల్లవు’అని అన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఉమ్మడి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. 

► ఆర్టికల్‌ 370 రద్దుకు మేము మద్దతు పలకలేదనడం అబద్ధం కాదా? 
► మిషన్‌ భగీరథకు కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం? 
► రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు కావట్లేదనడం సిగ్గుచేటు. 2021 మే 18 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న విషయం మరిచారా? దీని కింద ఇప్పటివరకు 3,620 మందికి చికిత్స అందించాం. ఇందుకు రూ.850 కోట్లు ఖర్చవగా కేంద్రం రూ.150 కోట్లే ఇచ్చింది.  
► సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయలేదన్నారు. రూ.2,679 కోట్లతో 3 ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోయారా? ► మన ఊరు–మన బడి డబ్బులు మావే. రూ.7,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా కేంద్రం ఇచ్చింది రూ.300కోట్లే.  
► కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈజీఎస్‌కు రూ.30 వేల కోట్లు ఇచ్చామన్నారు. అమిత్‌షా రూ.18 వేల కోట్లు అన్నారు. ఒక్కొక్కరిది ఒక్కోమాట. జూటా మాటలు తప్ప ఏం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేల్చాలని కేంద్రాన్ని కోరినా ట్రిబ్యునల్‌కు ఎందుకు రిఫర్‌ చేయరు?  
► రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. త్వరలో మరో 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైంది? దేశంలో 15.62 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. ఆర్మీలో 2 లక్షలు, రైల్వేలో 3 లక్షలు, బ్యాంకుల్లో 41 వేల పోస్టులు.. ఇలా అనేక విభాగాల్లో సుమారు 25 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అమరవీరులకు అమిత్‌ షా ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదు? బయ్యారం రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయి?   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top