ధరణి రద్దు చేస్తే.. బ్రోకర్ల రాజ్యమే

Harish Rao about Dharani Portal - Sakshi

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళారులు, పైరవీకారులదే పెత్తనం

పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ ఎల్లెంకల పడ్డది..: హరీశ్‌రావు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం అవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సుపరిపాలన పోయి., లంచాల పద్ధతి వస్తుందని, దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దు య్యబట్టారు.

ధరణి కారణంగానే ఇప్పటివరకు 60 లక్షల మంది రైతులకు రూ.60 వేల కోట్ల రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయని వివరించారు. శనివారం హరీశ్‌రావు సంగారెడ్డిలో జరిగిన సుపరిపాలన దినోత్సవంలో ప్రసంగించారు. ధరణిపై అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల తీరును ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.   

ఆంధ్రప్రదేశ్‌ ఎల్లంకల పడ్డది..  
‘సుపరిపాలన అంటే.. గతంలో ఒక లీడరుండె... అంతా హైటెక్‌.. అంతా సుపరిపాలననే.. మాట మాట్లాడితె హైటెక్‌ అంటుండె. ఇగ నా అంత అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంల లేడంటుండే. ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌... ఎల్లంకెల పడ్డది. ఇతని పుణ్యమా అని ఇయ్యాల ఎల్లంకెల పడ్డది ఆంధ్రప్రదేశ్‌. కానీ ఇవాళ కేసీఆర్‌గారు మాటలు తక్కువ... మనవి చేతలెక్కువ. కానీ వాళ్లయెట్లుండంటె మాటలు కోటలు దాటినయ్‌. చేతలు మాత్రం పకోడీలాగుండె వాళ్ల పరిస్థితి. కానీ మన కేసీఆర్‌ హయాంలో మాటలకంటే చేతల్లోనే కేసీఆర్‌ ఎక్కువగ దృష్టి పెట్టిండు.

మనది ప్రచారం తక్కువ. పని ఎక్కువ. కానీ ఆ ప్రచారం కేసీఆర్‌గారు చెయ్యరు. మనం చెయ్యాలె. లబ్దిపొందిన మనం, దాని ద్వారా లాభాలు పొందిన మనం, ఈ నిజాలను ప్రచారంలో పెట్టాలె. అందుకే మళ్లొక్కసారి అంటున్న.. ఏం లబ్దిపొందినమనేది పక్క రాష్ట్రం పొయ్యి చూసొస్తే అర్థమయితది’ అని హరీశ్‌ అన్నారు.
 
తాను తప్పు చేశానని లగడపాటి అన్నారు
తెలంగాణను వ్యతిరేకించి తాను తప్పు చేశానని లగడపాటి రాజగోపాల్‌ ఇటీవల ప్రకటించినట్లు తాను విన్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పాలన అందిస్తున్న కారణంగా లగడపాటి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top