గుజరాత్‌ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. హార్దిక్‌ పటేల్‌ రాజీనామా..

Hardik Patel Quits Congress Months Ahead of Gujarat Polls - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తు‍న్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.. ఈ మేరకు రాజీనామా లేఖను షేర్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్‌ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్‌ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

కాగా మరి కొద్ది నెలల్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలినట్లైంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్‌ బీజేపీ లేదా ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇ​క రాజీనామా నేపథ్యంలో గుజరాత్‌లో పార్టీ పరిస్థితిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తూ సుధీర్ఘ లేఖ రాశారు. చాలాకాలంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీరుపై ఆగ్రహంగా ఉన్న హార్దిక్‌ పార్టీ సీనియర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.

భారత్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అవసరం  వచ్చినప్పుడు మన నేతలు విదేశాల్లో ఉన్నారని రాహుల్‌ గాంధీని ఉద్ధేశించి విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గుజరాత్‌ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ మొబైల్‌ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి గుజరాత్‌పై ఆసక్తి లేదని అన్నారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ లీడర్లు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు సేవలు చేయడంలో మునిగిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను  సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రతిచోట పార్టీ తిరస్కరణకు గురవుతోందన్నారు.

చదవండి: రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

గత కొంత కాలంగా హార్దిక్‌ కాంగ్రెస్‌ను వీడుతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్‌ను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని,  పట్టించుకోలేదని బహిరంగంగా వెల్లడించారు. పీసీసీ సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో హార్దిక పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లోని పటీదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్‌కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top