సాక్షి, విశాఖపట్నం: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు దావోస్‌లో కూటమి పెద్దలు చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారాయన. మంగళవారం మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ..
వెన్నుపోట్లు, పొలిటికల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్‌లో నిజంగానే చంద్రబాబు యూనిక్ పీస్. చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ చోరీలో సిద్ధహస్తులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాదు నగరం, భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఇలా అన్ని తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. నారావారి దిష్టిబొమ్మ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని చెప్పుకుంటోంది.
దావోస్‌కు వెళ్ళింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో కాదు.. టీడీపీ బ్యాండ్ మేళంతో. వైఎస్సార్సీపి పై విమర్శలు చేయడానికి దావోస్ ను వేదికగా వాడుకోబోతున్నారు. అసలు దావోస్ వెళ్లి పెద్ద పెద్ద రికార్డింగ్ డాన్సులు పెట్టామని చెప్పుకుంటారా?.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దావోస్ వెళ్లి మీ డప్పు మీరు కొట్టుకుంటారా?. పండుగ పేరు చెప్పి అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినదా?..
వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోనీ బతికింది మీరు. నారా రామ్మూర్తి నాయుడునీ గొలుసులతో కట్టేసిన చరిత్ర మీది. లోకేష్ కు బ్యాక్ ఎక్కువ మైండ్ తక్కువ. రెండేళ్లలో మీరు ఒక పరిశ్రమనైనా తెచ్చారా?. .ఏపీకి వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలు తాము తెచ్చినట్లుగా చంద్రబాబు లోకేష్‌లు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారు.
చంద్రబాబు గొప్ప గురించి ప్రజల చెప్పాలి. అంతేగానీ తనకు తానే విజనరీ అని సొంత డప్పు కొట్టుకోవడం కాదు. చలి ఉంటుంది కాబట్టి మేము దావోస్ వెళ్లలేదని గతంలో నేను అన్నట్లు ప్రచారం చేశారు. అది లోకేష్ నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. నిరూపించలేక పోతే క్షమాపణ చెబుతావా. ఒక సీఎం కొడుకువై ఉండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా?..

ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇష్టానుసారంగా భూమి కేటాయించారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుపై చర్యలు ఉంటాయి.. నిబంధన ప్రకారం భూ కేటాయింపు జరపమని కోర్టు చెబితే.. పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ భూములను ఇవ్వండి. అంతేగానీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాళ్లా పంచారు అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


