కమలనాథుల గ్రేటర్‌ అటెన్షన్‌

GHMC Elections 2020: BJP Top Leaders To Campaign At Hyderabad - Sakshi

హైదరాబాద్‌ గల్లీకి ఢిల్లీ నేతలు

27న యోగి... 28న నడ్డా.. ఆఖరి రోజున అమిత్‌షా

మేయర్‌ పీఠంపై గురి

సాక్షి, హైదరాబాద్‌: ఏ రాష్ట్రంలో  ఎన్నికలు వచ్చినా దూరదృష్టితో ప్రణాళికలు రచించే బీజేపీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్‌లో దించుతోంది. గ్రేటర్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టింది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ సిటీలోని గల్లీలకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో నయాజోష్‌ నింపింది. 

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న అగ్రనాయకత్వం... గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా మిషన్‌–2023కి గట్టి పునాది వేయాలనే ఆలోచనలో ఉంది. అందుకే ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు, మహిళా, యువమోర్చా నాయకులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు వచ్చారు. ఫైర్‌బ్రాండ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా రానున్నారు. ఆఖరి నాలుగు రోజుల్లో అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించేలా కార్యాచరణను రూపొందించింది.

జవదేకర్‌ రాకతో పెరిగిన వేడి
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న ఎంపీ భూపేంద్ర యాదవ్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది. అంతేకాదు రాష్ట్ర పార్టీలోని నేతలంతా కలిసి పని చేసేలా కార్యాచరణ అమలుకు ఆదేశించింది. ‘ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ జమానా... అరవై తప్పుల ఖజానా’పేరుతో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చేతుల మీదుగా ఈనెల 22న చార్జ్‌షీట్‌ను వేసింది. ఇక అప్పటి నుంచి ప్రచార వేగాన్ని పెంచింది. 

బండి సంజయ్, కిషన్‌రెడ్డి, డీకే ఆరుణ , డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తదితర నేతలంతా రోజుకు ఆరేడు డివిజన్లలో విస్తృత ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నారు. ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య సోమ, మంగళవారాల్లో నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. యువ ఓటర్లే లక్ష్యంగా... ఉద్యోగాలు ఏవని, ఉపాధి ఎక్కడని టీఆర్‌ఎస్‌ను నిలదీశారు. ఉద్రిక్తతల మధ్య ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌లు కూడా బుధవారం నగరానికి వచ్చారు.

రంగంలోకి బడానేతలు
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ భూపేంద్రయాదవ్‌లు గురువారం హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 27వ తేదీన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్లలో రోడ్‌షోలతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. యోగికి బీజేపీ శ్రేణుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇటీవలి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ యోగి ప్రచారసభలకు భారీ స్పందన వచ్చింది. దాంతో రాష్ట్ర నాయకులు యూపీ సీఎం పర్యటనపై భారీఆశలు పెట్టుకున్నారు. ఈనెల 28వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభ, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. ప్రచారానికి ఆఖరిరోజైన 29న అమిత్‌షా సికింద్రాబాద్‌ పరిధిలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. 

నేడు మేనిఫెస్టో విడుదల
జీహెచ్‌ఎంసీలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చోటు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను పేర్కొంటూ, తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యాచరణతో బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. గురువారం దేవేంద్ర ఫడ్నవీస్‌ దీన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటినుంచే కార్యాచరణను అమలు చేస్తోంది. గ్రేటర్‌ పోరులో ప్రభావం చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావొచ్చని ప్రణాళికలు రచిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top