సంక్షోభంలో వ్యవసాయరంగం

Former MP Hannan Mollah Accused BJP Govt Over TS Anti Farmer Policies - Sakshi

ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్ల

నల్లగొండ టౌన్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌)జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్‌ మొల్ల ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం 2వ మహాసభల సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హన్నన్‌మొల్ల మాట్లాడుతూ.. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో 4లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములను కారుచౌకగా ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి వీలుగా చట్టాలు రూపొందిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

కనీస మద్దతు ధర, ప్రభుత్వ రాయితీలు, రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ కిసాన్‌సభ సహాయకార్యదర్శి డాక్టర్‌ విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించిన నల్లగొండ గడ్డపై ప్రసంగించడానికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆ స్ఫూర్తితో రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, నాయకులు పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top