మూడ్‌ కనిపెట్టలేకపోయిన 2004 సర్వే | Sakshi
Sakshi News home page

మూడ్‌ కనిపెట్టలేకపోయిన 2004 సర్వే

Published Mon, Feb 12 2024 7:00 PM

Flash Back A 2004 Survey That Failed To Estimate Public Mood - Sakshi

‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ అంటూ ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ప్రతి ఆర్నెల్లకోసారి సర్వే ఫలితాలను ఇస్తుంటుంది. సాధారణంగా – ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో రెండోసారి. ఈ ఏడాది ‘ఫిబ్రవరి సర్వే’ కాస్త ముందుగానే వచ్చింది. (మొన్న చూసే ఉంటారు.)  ఇది ఎన్నికల సంవత్సరం కనుక ఈ సర్వే అన్నది కొందరి కోసం ‘ముందస్తు’ ఏర్పాటు కావచ్చు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే – లోక్‌సభలో మోదీకి తిరుగు ఉండదని, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీదే దుమ్ముదుమారం అనీ!!

ఇకనేం, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత రేంజ్‌లో ఈ సర్వే ఫలితాలను బాబు గారి రెండు ప్రధాన పత్రికలు తమ ఫ్రంట్‌ పేజీల్లో ప్రముఖంగా ప్రచురించాయి.

ఒక్కసారి 20 ఏళ్లు వెనక్కు వెళితే కనుక – 2004లో ఇదే పత్రిక ఇదే విధమైన సర్వే ఫలితాలను ఇచ్చింది. వాజ్‌పేయి విజయ ఢంకా మోగించబోతున్నారని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సైకిల్‌ దూకుడు మీద ఉందని రాసింది. 

సర్వేను తాము ఎంత శాస్త్రీయంగా జరిపిందీ ఆ వివరాలు కూడా ఇచ్చింది. 

‘‘ముఖ్యమంత్రుల ప్రజాదరణ స్థాయి తెలుసుకునేందుకు 19 రాష్ట్రాలలో మేము జరిపిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రిగా అవతరించారు’’ అని ఆ సర్వే రాసింది. (రెండో స్థానం ములాయం సింగ్‌ యాదవ్, మూడో స్థానంలో ఇద్దరు..  నరేంద్రమోదీ, షీలా దీక్షిత్‌). 

అంతకు ముందు ఆగస్టులో (2003) జరిపిన సర్వేలో రాష్ట్ర ప్రజాదరణలో 10వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి కల్లా 3వ స్థానానికి చేరుకున్నారని సర్వే నివేదించింది! ఆయన పాలన ‘అసాధారణం’ అన్నవారు 10 శాతం, ‘బాగుంది’ అన్నవారు 49 శాతం, ‘ఒక మోస్తరు’ అన్నవారు 29 శాతం ఉంటే, ‘అధ్వాన్నం’ అన్నవారు 11 శాతం మంది ఉన్నారు. అసలేమీ చెప్పని వారు 1 శాతం మంది. 

ఇక్కడితో సర్వే ముగియలేదు. రహదారులు, పాఠశాల విద్య, మంచి నీళ్లు.. ఈ సెగ్మెంట్‌ల నాణ్యతలో కర్ణాటక, కేరళ, తమిళనాడుల కంటే ఆంధ్రప్రదేశే ముందుందని చంద్రబాబు పాలనకు మార్కులు వేసింది. 

అయితే ఆయన ఫెయిల్‌ అయ్యారు! ఆ సర్వే ఫెయిల్‌ అయింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ వచ్చింది. ఇక్కడ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 

ఎదురులేని పాలకుడు అని శ్లాఘించి, అధికారంలోకి వచ్చీ రాగానే నవతరం భాష మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని ఆధునికత వైపు మళ్లించే ప్రయత్నం చేశారని కీర్తించిన 2004 నాటి సర్వే ఒక విషయాన్నయితే ఉన్నది ఉన్నట్లు రాసింది. అది చంద్రబాబు విజన్‌ గురించి. 

తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కలలు కంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్‌–2020 బెడిసికొట్టే ప్రమాదం ఉందని తనైతే రాయలేదు కానీ,  విమర్శకులు అంటున్నారని మాత్రం వ్యాఖ్యానించింది. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి చంద్రబాబు ఈ కలన్నీ కంటున్నారని  విమర్శకుల భావన. ‘‘ఈ కలలు సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్య వేత్తలను ఆకట్టుకుని ఉండొచ్చు కానీ, కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించకూడదు. అవి ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మీదా, పేదరికాన్ని తొలగించడం మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాయి..’’అని ఆర్థిక, సామాజిక నిపుణులను ఉటంకిస్తూ సర్వే  పేర్కొంది. 

వ్యవసాయం, పేదరికం అన్నది చంద్రబాబు విజన్‌లోనే లేవు. ఈ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయానికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డి.బి.టి). ద్వారా ఈ ఐదేళ్లలో 4 కోట్ల, 58 లక్షల 37 వేల 727 మంది లబ్దిదారులకు 1 లక్షా 81 వేల 460 వందల కోట్ల రూపాయలను బదిలీ  చేసింది. నాన్‌ డి.బి.టి. కింద 1 కోటీ 10 లక్షల 18 వేల 982 మంది లబ్దిదారులకు 85 వేల 312 కోట్ల రూపాయలను అందించింది. 

ఆ సంగతి సర్వేలు చెప్పకపోవచ్చు. వాస్తవం ఏమిటన్నది ప్రతి లబ్దిదారునికీ తెలుసు.

Advertisement
 
Advertisement