సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంతా అటెన్షన్.. డైవర్షనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి అని సవాల్ విసిరారు. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్ చేశాడా? సజ్జనార్ చేశాడా? నాకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమే. ముగ్గురు అధికారులు కలిసి ప్రశ్నించారు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం. నేను ఏమైనా హోంమంత్రినా?. నేను అప్పుడేమైనా హోంమంత్రిగా పని చేశానా?. నేనే వాళ్లకు వంద ప్రశ్నలు వేశాను. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారించాలి.
రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టాను. అందుకే నాకు సిట్‌తో నోటీసులు ఇప్పించాడు. దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించండి. బొగ్గు కుంభకోణానికి కింగ్‌పిన్ రేవంత్ బావమరిదే. తప్పు చేయకపోతే రేవంత్ బావమరిదిపై విచారణకు ఆదేశించాలి. సీఎం, మంత్రుల మధ్య వాటాల పోరాటం రోడ్డు మీదకు వచ్చింది. మేము అన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. రేవంత్ నిజాయితీపరుడైతే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి.
చిల్లర రాజకీయాలే..
రేవంత్ చిల్లర రాజకీయాలపై మాకు అసహ్యం వేస్తోంది. ఎన్ని సిట్ నోటీసులు పంపినా భయపడేది లేదు. సిట్ విచారణపై లీకులు ఇస్తారు.. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్ చేశాడా? సజ్జనార్ చేశాడా? నాకు తెలియదు. మాకు అరెస్ట్‌లు, పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వ్యవహారం అంతా అర్థం అవుతోంది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. మీవన్నీ కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలే. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు నడవవు. విచారణ పేరుతో సమయం వృథా చేశారు. మీరు ఇచ్చిన నోటీసులు గౌరవంగా భావిస్తాం. ఎన్నిసార్లు సిట్ అధికారులు పిలిచినా వస్తాను. విచారణకు సహకరిస్తాను అని తెలిపారు.
ముగ్గురి మధ్య వాటాల పంచాయితీ..
సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినోళ్ళం. సిట్ నోటీసులు రాగానే పారిపోయేవాళ్లం కాదు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నా సిగ్గు రావటం లేదు. రేవంత్ భాష, మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ తయారుచేసిన సైనికులం. రేవంత్ మాదిరి వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు. దర్యాప్తు పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. బొగ్గు కుంభకోణంపై విచారణ జరుపుతాం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సిట్ అధికారులు.. హరీష్‌ను దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం, హరీష్ రావు నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలను కలిసి చర్చించారు.


