
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న'బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు నా కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనంపైన ఉన్న మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఫొటోలపైన నిలబడి హరి హర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారు. దాదాపు 15 నిమిషాలకు పైగా రణరంగం సృష్టించారు.
గతంలో ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి సైకో దుందుడుకు చర్యలకు దిగడం తణుకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జనసేన అల్లరి మూకలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ చర్యలకు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రౌడీ మూకలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా కలిసి అత్తిలిలో నా ఇంటిపైన దాడిచేసి వీరంగం సృష్టించారు.

ఒకపక్క పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతగా ప్రేమిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీ నాయకులు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించిన సొంత పార్టీ వారిని సంజాయిషీ కూడా అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. చంద్రబాబే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారని పవన్ పదే పదే చెప్పడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ఆవేదనపూరితంగా చెబితే, పవన్ మాత్రం చాలా క్యాజువల్‌గా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారంటే ఆ పార్టీ వారికి ఆయనిచ్చే గౌరవం అలాంటిది. ఆయన సొంత జనసేన కార్యకర్తల కంటే టీడీపీ నాయకత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు.