
( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.. మూడు రోజల పాటు ఢిల్లీలో ఉన్న ఈటల.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను ఈటల కలిశారు.
ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఈటల.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై సుదీర్ఘంగా చర్చించారు. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈటలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకునే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఈటలకు అమిత్ షా సూచించినట్లు తెలుస్లోంది.
మరొకవైపు బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఈటల. బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు ఈటల విజ్ఞప్తి చేశారు. ఈటల ఢిల్లీ పర్యటలనో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లను సైతం కలిశారు. వీరంతా ఈటలకు ఏం చెప్పారనేది చర్చనీయాంశమైంది. ఈటలకు అగ్రనేతలు సూచించింది ఏమిటి?, వాటిని ఎలా అమలు చేయబోతున్నారనేది ఆసక్తికరం.
కాగా, తెలంగాణలో రాబోవు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్.. స్థానిక నేతలను ఢిల్లీ పిలుపించుకుని పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఈటలతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం బండి సంజయ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరొకవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు ఢిల్లీలోనే ఉన్నారు.