మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..

EC Transferred Munugode ByElection Returning Officer - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల‌ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించింది.


                  మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌

మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ముగిసిన అక్టోబర్ 17న తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారని యుగతులసి అభ్యర్థి శివకుమార్ తెలిపారు. అయితే అక్టోబర్ 18న విడుదలైన జాబితాలో మాత్రం బేబీ వాల్కర్ గుర్తు ఇచ్చారని పేర్కొన్నారు.  తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, క్యాప్, చపాతి రోలర్‌ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్‌ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేశారు. 

ఆ మరునాడే రిటర్నింగ్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్‌కు రోడ్డురోలర్ గుర్తునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చదవండి: మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్‌.. అంతా మీ ఇష్టమా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top