కొండా Vs ఎర్రబెల్లి.. తెర వెనుక ఏం జరుగుతోంది?

Dominance Battle Between Two Women Leaders In Warangal Congress - Sakshi

సాక్షి, వరంగల్: వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి.. కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టిందా.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందా.. తూర్పు టిక్కెట్ రాజకీయంగా దూమారం రేపుతుందా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. డీసీసీ తొలి సమావేశంలో వర్గ విబేధాలు బహిర్గతంకావడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తుంది. తూర్పులో కొండా వర్సెస్ ఎర్రబెల్లి అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి.

ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయి. తూర్పులో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతుంది. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే తానే అంటు మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారం సాగిస్తుండగా అనూహ్యంగా డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. వరంగల్ డిసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు కొండ సురేఖ-మురళీ దంపతులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు ఎర్రబెల్లి స్వర్ణకు డీసీసీ పదవి దక్కింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న కొండా దంపతులు పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పునియోజకవర్గంలో తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నాయకులతోపాటు పక్క జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హజరయ్యారు. తూర్పు టిక్కెట్ ఆశిస్తు ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులు మాత్రం ఆ సమావేశానికి హాజరుకాలేదు. వారి అనుచరులను సైతం సమావేశానికి హాజరుకాకుండా కట్టడి చేశారు. కానీ కొండా వర్గానికి చెందిన కట్టస్వామి హాజరయ్యారు.

తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతనిపై పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందినవారు దాడి చేశారు. చొక్కా చించేసి చితకబాదారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలోనే రెండు వర్గాలు పరస్పరం తన్నుకోవడంతో సమావేశం రసాభసగా మారింది.

ముందుగా ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్‌రావు, కొండా సురేఖ-మురళీ వర్గీయులే కొట్టుకున్నారని ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఎర్రబెల్లి వర్గీయులు కొట్టిపారేశారు. పార్టీలో గ్రూప్‌లు లేవని, తామందరిది ఒకే గ్రూప్ కాంగ్రెస్ అని ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. డీసీసీ సమావేశానికి కొండా దంపతులు దూరంగా ఉన్నప్పటికి సాయంత్రం లేబర్ కాలనీలో కొండా మురళీ పర్యటించి పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొండా దంపతుల పని అయిపోయిందని, సురేఖ ఇటురాదని, వేరే వాళ్లు వస్తారని ప్రచారం కావడంపై మురళీ ఘాటుగానే స్పందించారు. సురేఖ ఎటూ పోదు..తూర్పు నుంచే పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు. ఇరువర్గాల నేతల వ్యాఖ్యలు కాస్త పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పైకి అంతాకలిసి ఉన్నామని పోజులిచ్చినప్పటికి అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలతో రగిలిపోతున్నారు. వర్గ విబేధాలకు ప్రధాన కారణం వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్, డీసీసీ అధ్యక్ష పదవేనని తెలుస్తుంది. పనిచేసే వారికి అధిష్టానం డీసీసీ పదవి ఇచ్చిందని ఎర్రబెల్లి వర్గం భావిస్తుండగా,  ఏకాభిప్రాయం లేకుండా ఎలా డీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని కొండా వర్గీయులతోపాటు అసంతృప్తివాదులు మడిపడుతున్నారు.

ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న టికెట్ పోరు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ సమావేశంతో సైతం బహిర్గతమైనట్లు సమాచారం. ఆ సమావేశంలో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారట. పీసీసీ నాయకత్వం కొండా సురేఖను పరకాల నుంచి పోటీ చేయాలని సూచించగా, సురేఖ మాత్రం వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పీసీసీ నాయకత్వం కొండా ప్రతిపాదనలకు భిన్నంగా ఎర్రబెల్లి స్వర్ణను  డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో తూర్పు తమదేనంటూ ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులకు మింగుడు పడడంలేదట. అందులో భాగంగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయట. తూర్పు అభ్యర్థిగా సురేఖ స్వయంగా ప్రకటించుకుని నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించన ఎర్రబెల్లి స్వర్ణ సైతం తూర్పులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. డీసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇవ్వకుండా ఎర్రబెల్లి స్వర్ణకు కట్టబెట్టడమే కాకుండా తెరచాటుగా తూర్పు నియోజకవర్గంపై స్వర్ణ కన్నెయ్యడంతో కొండా దంపతులు అసంతృప్తితో పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
చదవండి: కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి

ఎవరైనా తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తామని, పాత కొండా మురళిని చూస్తారని హెచ్చరించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు మహిళా నేతల మధ్య టికెట్ పోరు అటు పార్టీ పెద్దలను ఇటు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరోక్ష హెచ్చరికలు, గ్రూప్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతుంటే వర్గ విభేదాలు, గ్రూప్ తగాదలు తలనొప్పిలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top