ఇండి కూటమిలో కలకలం.. మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది? | DMK to skip June 8 INDIA bloc meeting amid Congress fallout | Sakshi
Sakshi News home page

ఇండి కూటమిలో కలకలం.. మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది?

Jun 4 2026 7:35 PM | Updated on Jun 7 2026 8:31 PM

DMK to skip June 8 INDIA bloc meeting amid Congress fallout

Representative image

చెన్నై: ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో తాము పాల్గొనబోమని డీఎంకే గురువారం తెలిపింది. ముఖ్యంగా "కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం" కావడంతో హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.

ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‍ల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉంది. తమిళనాడు ఎ‍న్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని డీఎంకే తెలిపింది.

"తమిళనాడు శాసనసభ ఎన్నికల తర్వాత డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్ల మా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ.. జూన్ 8న న్యూఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాదు" అని పార్టీ తెలిపింది.

అయితే ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే పేర్కొంది.

డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డీఎంకే అధికారికంగా కోరింది. దీంతో దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు దూరంగా నిలిచింది.

మరోవైపు, పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఇండి కూటమి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement