టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు | Differences in TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు

Published Thu, Jun 20 2024 5:19 AM | Last Updated on Thu, Jun 20 2024 5:19 AM

Differences in TDP

మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలను సాగనంపేందుకు యత్నాలు

సాక్షి, పార్వతీపురం మన్యం:  పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజక­వర్గ టీడీపీలోని విభేదాలు రచ్చ­కెక్కాయి. ఇదే పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియో­జక­వర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవు­లును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మూడు మండలాలు, మున్సిపా­లి­టీకి చెందిన నేతలంతా తీర్మానం చేశారు. తీర్మా­నాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. వీరి వెనుక నియోజకవర్గానికి చెందిన కీలక నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

గత ఎన్ని­కలకు ముందు టీడీపీ పార్వతీ­పురం నియో­జ­కవర్గ ఇన్‌చార్జిగా బోనెల విజయచంద్రను పార్టీ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వార­పురెడ్డి జగదీష్‌లను విజయచంద్ర కలుపుకొని వెళ్లకుండా పూర్తిగా పక్కన పెట్టేశారని, సీనియర్లన్న గౌర­వం లేకుండా వ్యవహరించేవారన్న విమ­ర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. టీడీపీ­లో ఉంటూ సొంత పార్టీ అభ్యర్థికి వ్యతి­రేకంగా పని చేశా­రన్నది మరో ఆరోపణ. 

ఎన్నికలకు ముందు ఏ కార్యక్రమం చేప­ట్టినా ద్వారపురెడ్డి, బొబ్బి­లి చిరంజీవులును బోనెల విజయచంద్ర ఆహ్వా­నించకుండా నిర్లక్ష్యం చేశారని జగదీష్‌ వర్గం చెబుతోంది. ఎన్నికల్లో పార్వతీపురం నియో­జకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన విజయచంద్ర విజయం సాధించారు. ఆ తర్వాత పార్వతీపురంలో జరిగిన విజ­యోత్సవ సభలో ఆ సీనియర్‌ నేతలి­ద్దరూ హాజరు కాకపోవడం.. అదే వేదికపై పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన వారిని ఉపే­క్షించమని ఎమ్మెల్యే పరోక్షంగా హెచ్చ­రించడం చర్చ­నీయాంశంగా మారింది. 

అక్కడ భేటీ.. ఇక్కడ సస్పెండ్‌కు తీర్మానం
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర­బాబును మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గ టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. పార్టీకి అన్యాయం చేసి.. మరలా ఏ ముఖం పెట్టుకుని అధినేతను కలిసి వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 

పార్వతీ­పురం పట్టణంలో మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ద్వారపురెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తామంతా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తు­న్నట్లు వెల్లడించారు. సీతానగరం, బలిజి­పేట, పార్వతీపురంలలో వారి అనుచర­గణం కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిందని.. అందరినీ అధిష్టానం బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement